సారంగి
భానోదయవేళ శీతాకాలపు మంచుతో తడిసి మురిసిపోతోంది ప్రకృతి. చెట్లు, వృక్షాలు. మహావృక్షాలూ, గుంభనమైన చిరునవ్వు నవ్వుతూ మంచు ముత్యాలు కురిపిస్తున్నాయి. అడవంతా ఆహ్లాదకరంగా ఉంది. చిరుగాలి అల్లరి గీతాలేవో పాడుతూ ఉంది.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే రెండు మహా ప్రాణుల పయనం మొదలయింది. ఒకరు ఇక్కడికి వేటకోసం వచ్చి నిన్నరాత్రే అడవిలో బస చేసిన జనపతి. రెండోవారు, నిద్రలేవగానే ఆకలికీ, ఆహ్లాదానికీ... ఓసారి ఘర్జించి బయలుదేరిన వనపతి. రాజుకి ఆనందపు వేట. మృగరాజుది ఆకలివేట.
వీర, శౌర్య, పరాక్రమాలతో ముందుకి దూసుకుపోతున్న మహారాజు. ఠీవి, దర్పం, బలగర్వంతో అడుగులు వేస్తున్న మృగరాజు. రాజుకి మృగరాజైనా సరే వేటకి. మృగరాజుకి జింకచాలు, భుజించేందుకు. ఇరువురూ ఎదురుపడితే మహా సంగ్రామమే కానీ... ముందుగా రాజేంద్రుడు మృగేంద్రుని చూశాడు. దారికాచాడు. పొదల మాటున సవ్వడి చేయకుండా నడుస్తున్నాడు. గమ్యం దూరం, వేగం, బలం, అన్నీ అంచనా వేశాడు. విల్లంబులు తీశాడు. గురిచేశాడు. ఏవో లెక్కలు వేశాడు.
చిన్న అలికిడి అయినా గమనించగలసింహం చూపు దగ్గరలోనే ఉన్న జింకపై ఉంది. జింకకి అటువేపు పొదలున్నాయి. ఆ పొదలలోకి అది దూకితే పట్టుకోవడం కష్టం. కనుక అలికిడి చేయరాదు. అది తప్పించుకోకూడదు. ఇది వనరాజు తపన.
సింహం తప్పించుకోరాదు. ఇది ప్రజల సమస్య. అంతేకాదు. తన పరువు సమస్య కూడా ఆలోచనలు, అంచనాలు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. అంతే! రాజు
కరము నుండి శరము విడువబడింది.
గురి తప్పని విలువిద్య ఆయనది. మరుక్షణం సింహాన్ని పడేసేదే...............