పాకిస్థాన్ సరిహద్దులు దాటి...
నిర్భయంగా ప్రపంచమంతా తిరగగలిగే యాత్రికులకు కూడా పాకిస్థాన్ వెళ్ళటం అంత తేలికేమీ కాదు. అనిశ్చితమైన రాజకీయ పరిస్థితులు, భద్రతా కారణాలవల్ల అక్కడికి వెళ్ళటానికి వీసా సంపాదించటం ఒక ఎత్తైతే, పాకిస్థాన్లో స్థానికంగా ప్రయాణం చేయటం మరొక ఎత్తు. కాని పాకిస్థాన్ వెళ్ళటం మాత్రం యాత్రికుల కల. ఎందుకంటే అసాధారణమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు కొన్ని పాకిస్థాన్లో ఉన్నాయి. ప్రపంచానికే తలమానికంగా నిలిచిన సింధు నాగరికత చిహ్నాలు హరప్పా, మొహంజోదారో నగరాలు. ఈ రెండు నగరాలు చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రాచీనమైనవి. పాకిస్థాన్, భారతదేశాలు కలసి ఉన్న రోజుల్లో భారత ఉపఖండంలో భాగంగా ఉన్న ఈ రెండు నగరాలు దేశ విభజన తరువాత పాకిస్థాన్లో ఉండిపోయాయి. ప్రపంచ చారిత్రక పటాన్ని అవగాహన చేసుకోవాలనుకునే యాత్రా ప్రియులకు వీటిని దర్శించలేకపోవటం దుస్సహం. అందుకే ఈ ప్రయాణం.
ఇండియా, పాకిస్థాన్ మిత్రదేశాలు కావని అందరికీ తెలుసు. చారిత్రకంగా, భౌగోళికంగా, సంస్కృతి పరంగా అనాదిగా ఒకటిగా ఉన్న ఈ రెండు దేశాలు 1947లో జరిగిన విభజన తరువాత ఒకదాని మీద ఒకటి కత్తులు నూరుకుంటూనే ఉన్నాయి. కాశ్మీర్ వలన ఇద్దరికీ సరిహద్దు సమస్య ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. అణ్వాయుధాల తయారీతో బలాబలాలు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటున్న ఈ రెండు పొరుగు దేశాల మధ్య దూరం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. శతృ దేశాలుగా ప్రపంచ రాజకీయపటంలో ఉద్రిక్తమైన ప్రాంతాలుగా పరిగణింపబడటంతో, అస్థిరత నెలకొనటంతో రెండు దేశాల ప్రజలకు అంతు లేని స్పర్ధ, అసౌకర్యం ఏర్పడ్డాయి...............