మనోహరం శాసనపర్వం
తెలంగాణా శాసనాలని పరిష్కరించి ప్రకటించినవారిలో అగ్రగణ్యులు కీ.శే. బి.యన్. శాస్త్రిగారు. 'తెలంగాణాలో జన్మించి, తెలంగాణా శాసనాలను పరిష్కరించి, ప్రకటించిన తొలి తెలంగాణా శాసన పరిశోధకులు వీరు. అందుకే వీరిని “శాసనాల శాస్త్రి" అంటారు. వీరి కుమార్తె శ్రీమతి భిన్నూరి మనోహరి తండ్రిగారి వద్ద శాసనాలు చదవడంలో ఓనమాలు దిద్దుకొని అనేక శాసనాలను పరిశీలించి, పరిశోధించి "ఆంధ్రదేశ శాసన సాహిత్యంలో స్త్రీలు” అన్న అంశంపై పిహెచ్.డి చేశారు. అది చాలా చక్కటి పరిశోధక గ్రంథంగా ప్రాచుర్యం పొందడమే కాక చారిత్రకంగా స్త్రీల గురించి ఏ విషయ వివరాలు కావాలన్నా 'రెడీ రెక్నార్'లాగా ఆధార గ్రంథమైంది. మనోహరిగారు గత రెండేళ్ళుగా 'నమస్తే తెలంగాణ'లో ప్రతి ఆదివారం 'శాసనపర్వం' అన్న శీర్షిక కింద తెలంగాణలోని ఒక వంద ప్రముఖ శాసనాల గురించి ప్రత్యేక కాలమ్ రాశారు. చరిత్రకు శ్వాసనాళాల వంటి ఈ చారిత్రక శాసనాలను పండితులకు, పరిశోధకులకే కాక సామాన్య పాఠకులకు కూడా అర్థమయ్యే విధంగా మన చరిత్రకు ప్రతిబింబాలుగా వ్యాసాలు రాశారు. అసలు శీర్షిక కూడా 'శాసనపర్వం' అని చక్కగా పెట్టారు. పర్వం అంటే పండుగ. ఈ శాసనాలన్నీ దాన శాసనాలే. పర్వదినాల్లోనో, పుణ్య కాలాల్లోనో రాజులైనా, రాణులైనా, ప్రాంతీయ పాలకులైనా, మంత్రులైనా, అధికారులైనా, సామాన్యులైనా దానధర్మాలు చేస్తారు. అట్లాగే పర్వమంటే భాగము అని కూడా అర్థం. మన ప్రాచీన సంస్కృతిలో దానధర్మాలు చేయడం జీవితంలో ఒక భాగం. ఒక పర్వం. అందుకే దీన్ని శాసనపర్వం అనడం ఎంతైనా సమంజసం. తెలంగాణాలో లభించిన శాసనాలలోని వంద శాసనాలను అద్భుతమైన చారిత్రక విషయాలను, ఆ శాసనాల ప్రత్యేకతలను,................