మరువలేని దురాగతాలకు కేరాఫ్ కాంగ్రెస్
జూన్ 25 : దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు. నేటి తరానికి ఒకప్పుడు మన దేశంలో ఎమర్జెన్సీ విధించారన్న విషయం కూడా తెలిసి ఉండకపోవచ్చు. కాని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో ఎన్నికైన ఒక ప్రభుత్వం అంబేద్కర్ కమిటీ రచించిన భారత రాజ్యాంగాన్ని చెత్తబుట్టలో విసిరేసిందని, 44 సంవత్సరాల క్రితం దాదాపు 19 నెలలు ఈ దేశంలో ప్రజలు ప్రశ్నించే స్వేచ్ఛను కోల్పోయారని వారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి ఘట్టమైన ఎమర్జెన్సీ గురించి పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించలేదు.
1971 లోకసభ ఎన్నికల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడడంతో ఆమె ఎన్నికల చెల్లనేరదని 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. ఆరేళ్ల పాటు ఆమెను ఎన్నికల్లో పోటీనుంచి నిషేధించింది. సుప్రీంకోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు. దీనితో తన పదవిని కాపాడుకునేందుకు ఆమె మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే కాలరాయాలని నిర్ణయించారు. 1975 జూన్ 25న ఎమర్జెన్సీని విధించారు. ఎమర్జెన్సీ విధించే విషయం చివరకు మంత్రిమండలికి కూడా తెలియకుండా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ద్వారా అర్థరాత్రి సంతకం చేయించారు. తన రాజీనామాను డిమాండ్ చేస్తూ ఏకమైన ప్రతిపక్షాలను అణచివేసేందుకు అటల్ బిహార్ వాజపేయి, లాల్ కృష్ణ ఆడ్వాణి, మధు దండావతే, వెంకయ్యనాయుడుతో సహా అనేకమంది నేతలను, వేలాది మంది ప్రజలను, జర్నలిస్టులను క్రూర చట్టాల క్రింద జైలు పాలు చేశారు. అనేకమందిని పోలీసు నిర్బంధంలో పాశవికంగా హింసించారు. ప్రాథమిక హక్కులు చెల్లనేరవని ప్రకటించారు. న్యాయవ్యవస్థను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకుని న్యాయమూర్తులు తమ చెప్పు చేతల్లో ఉండేలా చూసుకున్నారు. వార్తాపత్రికలపై ఆంక్షలు విధించారు. పోలీసు అధికారులు అనుమతించిన వార్తలనే ప్రచురించేందుకు అనుమతించారు. చలన చిత్ర పరిశ్రమతో కూడా తనకు ఊడిగం చేయించుకున్నారు. దూరదర్శన్, ఆకాశవాణితో పాటు మొత్తం సమాచార శాఖ తమకు బాకాలు ఊదేలా చేసుకున్నారు. పేదల ఇళ్లను విధ్వంసం చేశారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను అమలు చేశారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ, ఆయన వందిమాగధ దళం చేసిన అత్యాచారాలు, దారుణ మారణ కాండ గురించి చెప్పాలంటే ఎని పేజీలైనా సరిపోవు .
ఇన్ని దారుణాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ తర్వాతి కాలంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే, ప్రజా బలం అఖండంగా ఉన్న నరేంద్రమోదిని నియంతగా అభివరిస్తూ గత ఎన్నికల్లో నానా దుర్భాషలాడుతూ దుష్ప్రచారం చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు.
సత్యకాలమ్