"సత్యార్థమూ, సత్యాన్వేషణమునూ..."
- డా|| వోలేటి పార్వతీశం
కాలం ఒక నిరంతర ప్రవాహం. కాలం ఆద్యంతాలను ఆకళింపుకు తెచ్చుకోవడం సులభ సాధ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ జగత్తు సర్వం కాలాధీనం. కాలంతోనే ప్రకృతిలో మార్పులెన్నో సంఘటిల్లుతాయి. మార్పు సృష్టికి నైజమైపోయింది. మార్పు సమాజంలో సహజమైపోయింది. సమస్తాన్ని తనవెంట నడిపించగల శక్తియుత కాలం. క్షణాలు, నిముషాలు, గంటలే కాదు, రోజులు, వారాలు, మాసాలు కూడా తరలిపోతాయి. అంతేనా సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు, యుగాలు కూడా, కాలంతో జతపడి నడవాల్సిందే. అలుపు సొలుపు లేకుండా సాగిపోతున్న కాలంలో ఎప్పుడో, ఎక్కడో పుట్టిన కొందరు మహనీయులో, వారి జీవితాలో, వారు ప్రతిష్టించిన విలువలో, ఆదర్శాలో లేదూ, వారితో ముడిపడివున్న సంఘటనలో, కాలం రహదారుల్లో దీపధ్వజాలుగా నిలిచిపోతాయి. అవి అక్కడే ఆగిపోయినా, ఆ దీపపు కాంతులు మాత్రం కాలంతో కలిసి ప్రవహిస్తాయి. ముందు ముందు నడకలకు మార్గదర్శనమూ చేస్తాయి. ఏనాటి సత్యయుగం ఎప్పటి త్రేతాయుగం. అలనాటి ద్వాపర యుగం, గడచి వచ్చిన ఆకాలంలో ఎందరెందరో మహనీయులు ఇంకెందరు మహర్షులు ఇప్పటికీ జ్యోతిర్ముఖులై వెలుగులు ప్రసరించటం లేదా! వాళ్ళు సంస్థాపించిన విలువలు, ఆదర్శాలు, కాలాన్ని అధిగమించి, స్థిరత్వాన్ని ప్రకటించ లేదా? గమనికలను కాస్త నిశితం చేసి చూడండి. శ్రీరాముడు, రామాయణం అలాంటివే కదా! గణనలకు అందని కాలంనాటివి కదా! త్రేతాయుగం, అప్పటి రామకథ. ఇప్పటి కలి యుగంలో, ఈ ఆధునిక యుగంలో మన వెన్నంటి నడుస్తోంది. కాదు, మనకంటే ఓ అడుగు ముందే వుండి మనల్ని నడిపిస్తోంది. చిత్రం రామాయణము................