పీఠిక
భారతదేశ సాంస్కృతిక విప్లవ పోరాట స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే. స్త్రీ విముక్తి ప్రధాత, మానవా అభ్యుదయ వికాస జీవన వ్యవస్థల పునర్ నిర్మాణకర్త. భారతదేశంలోని చారిత్రక మలుపులో నిలబడి జీవన జ్యోతులను వెలిగించిన మానవతా మూర్తి సావిత్రిబాయి ఫూలే. సావిత్రిబాయి ఫూలే జీవిత గాధ ఒక జీవన దృశ్యం. అందుకే ఈ పుస్తకం ప్రారంభంలోనే ఇలా విశ్లేషించాను. సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో ప్రత్యామ్నాయ జీవన వ్యవస్థలు వెలిగించిన ఒక మహోజ్వల కాంతిదీపం. భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన స్త్రీమూర్తి ఆమె. ఎవరైతే చరిత్రను మలుపు తిప్పుతారో వారికే యుగ కర్తృత్వం వుంటుంది. చరిత్రలో నడిచేవాళ్ళు మరణించిన తర్వాత తిరిగి లేవరు. చరిత్రను మార్చాలి అంటే త్యాగాలు కావాలి. త్యాగం అనేది ఒక ఆరిపోని దీపం. ఆమె చరిత్రను మార్చింది. అందుకే తిరిగి లేచింది. ఈ రోజుకి సావిత్రిబాయి పూలే భారతదేశంలో వెలుగొందుతుంది అంటే త్యాగం, కృషి, పట్టుదల, నిజాయితీ, నీతి, విజ్ఞానం, విలువలు సావిత్రిబాయి ఫూలేకే సొంతం.
ఇంతగొప్ప వ్యక్తి యొక్క చరిత్ర వ్రాయడానికి పూనుకోవడం నా జీవిత సాఫల్య కథనం. పితృస్వామ్యాన్ని ఎదిరించి స్త్రీ విముక్తిని సాధించిన గొప్ప విధూషిమణి ఆమె. జ్యోతిరావ్ ఫూలేకు ఊపిరిగా నిలిచి మహోద్యమాన్ని నడిపిన ధీశాలి. అసలు జ్యోతిరావు పేరు మరాఠిలోని దైనా 'జ్యోతి' అనే నామవాచకం సంస్కృతి నుండి వచ్చింది. జ్యోతి అంటే 'వెలుగు' అని అర్థం. 'రావు' కలిసింది. తరువాత అది జ్యోతిరావుగా కూడా పిలవబడింది. తరువాత 'జ్యోతి' అని పిలువబడ్డారు. ఇక్కడ 'భా' అనేది ప్రజలు ఎంతో గౌరవ పూర్వకంగా పిలుచుకున్న పేరు. జ్యోతిభా తండ్రి గోవిందరావు. 'మహాత్మా జ్యోతిరావు ఫూలే' అని ధనుంజయ్ కీర్ ఖరారు చేశారు. రోజ్ విండ్ 'ఫూలే' అంటుండగా కీర్ 'పూలే' అనే వాడాడు. జ్యోతిరావు పూలే కుటుంబం గురించి వ్రాస్తూ జి.పి. దేశ్పాండే ఇలా వివరించారు. మహాత్మ ఫూలే జీవితం ఒక వెలుగుబాట. సావిత్రిబాయి ఫూలే జీవితం మనకు అనేక నేపథ్యాలనుండి చారిత్రక గానం వినిపిస్తుంది. సావిత్రిబాయి ఫూలే చదువుతుంటే మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి అణచివేత, పోరాటాలు, మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.....................................