'సావిత్రి క్లాసిక్స్' పుస్తకం ఒక్కోపేజీ తిప్పుతూ చదువుతూ వెళుతుంటే అప్పటి రోజులు, ఆ చిత్రాలు, ఆనాటి కళాకారులు.. అన్నీ కళ్ళముందు రీల్లా తిరిగాయి. అప్పటి కాలానికి వెళ్లిపోయాను. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల రోజుల్ని ఎందుకు స్వర్ణయుగం అంటామో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. సావిత్రిగారు నటించిన పౌరాణికాలు, జానపదాలు, సాంఘిక చిత్రాలు వేరు వేరు అధ్యాయాలుగా విభజించి వివరించడం బాగుంది. మరీ ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా ఎంత చెప్పాలో అంతే చెబుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా సులభంగా అర్థమయ్యేలా సాగిన సంజయ్ కిషోర్ రచనాశైలి బాగుంది. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనీ, మళ్లీ మళ్లీ చదవాలనీ అనిపిస్తుంది ఈ పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే సావిత్రి గారంత అందంగా ఉందీ పుస్తకం. ముఖ్యంగా సావిత్రిగారి అభిమానులకు ఈ పుస్తకం ఓ పండగేనని చెప్పాలి.
'పద్మభూషణ్' శ్రీమతి పి. సుశీల
ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని
సంజయ్కిషోర్ వ్రాసి రూపొందించిన 'సావిత్రి క్లాసిక్స్' పుస్తకం చేతిలోకి తీసుకొని ముఖచిత్రాన్ని అలా చూస్తుండిపోయాను. పేజీ తిప్పాలన్న అలోచన కూడా కలగలేదు. పుస్తకం లోపల ఏముంటుందో మొత్తం ఆ ముఖచిత్రమే చెప్పేసింది. అంత అందంగా ఉంది. భక్తులు రామాయణం, మహాభారత గ్రంథాలను ఎలా దాచుకుంటారో.. సినీప్రేమికులు సంజయ్కిషోర్ వ్రాసే పుస్తకాలను అలా దాచుకోవాలి.
శ్రీ మురళీమోహన్
ప్రముఖ నటులు, నిర్మాత