ఒకటి
"ఒరేయ్ తాగుబోతూ, ఇంకా మంచంలోనే దొర్లుతున్నావా?!”
కలల తోటలో విహరిస్తున్న నన్ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఆ స్వరం. అంతకన్న అయిష్టమైన, చీదరైన స్వరం ఇంకొకటి లేదు.
అప్పుడు నేనూ, సెప్పీ పెద్ద మర్రిచెట్టు కొమ్మ కింద వున్నాం. ఆ కొమ్మ మీద ఆకులు గుబురుగా పెరిగాయి. దాక్కునేందుకు అడవిలో ఉన్న అన్ని ప్రదేశాల్లో అదే ఆమెకు ఎక్కువ ఇష్టమైంది. కానీ, ఆ క్షణంలో బుఖియా బిగ్గరగా, వికృతంగా అరిచిన అరుపు వినపడగానే ఆమె మాయమై పోయింది.
ఒక దౌర్భాగ్యపు బడలిక ప్రేయసి లాగా నా శరీరాన్నంతటినీ గట్టిగా కరుచుకుంది. బాగా సన్నదైపోయిన నా పరుపుమీద పడుకుని జ్ఞాపకాల తీపిని తల్చుకుంటూ, మరికొంత సేపు నిద్ర పోవాలని అనుకున్నాను కానీ, ఆ అదృష్టం నాకు దొరకదని తెలుసు. నా యింటి ప్రధాన ద్వారం బలమైంది కాదు. దాని మీద ఎవరో గట్టిగా మళ్లీ మళ్లీ బాదుతున్నారు. చీదర కలిగేలా ఆ జుగుప్సకరమైన అరుపే మళ్లీ వినపడింది.
"రెండు నిమిషాల సమయం ఇస్తున్నాను. అప్పటికీ నువ్వు రాకపోతే నేరుగా కోయాజీకి ఫోను చేస్తాను. వేళ కాని ఈ వేళలో లేపినందుకు ఆయన పిచ్చివాడిలాగా శివమెత్తితే, అప్పుడు బాగుంటుంది మీకు. ఆ ముదనష్టపు పీనుగుల్లోంచి దుర్వాసన వస్తున్నదనీ, శోకాలు పెడుతూ చాలా మంది బంధువులు జమ అవుతున్నారనీ, అయినా శవాలను మోసే నీ ఖాంధియా గాడు తప్పతాగి సోయి లేకుండా దీర్ఘనిద్రలో ఇంకా మంచంలోనే ఉన్నాడనీ అంతా చెప్పేస్తాను.”
***
తిట్లు నిండిన ఉపన్యాసం, కంకర మీద బూట్లు నడుస్తున్న శబ్దం రెండూ దూరమయ్యాయి.
ఓ బుఖియా దరిద్రుడా, మేం తాగే సారాయికి నువ్వు డబ్బులిస్తున్నావా? ఇవ్వటం లేదు కదా? ఓ గ్లాసెడు సారా సంగతి పక్కన పెట్టు. ఒక్క గుక్కెడు నీళ్లు తాగేందుకు కూడా వీల్లేదాయె.......................