శికారి
కొట్లాట కొంచెం తెరిపిచ్చె.
'నానా'కు సారాయి మత్తు దిగిందో. ఎక్కిందో తెలేదు. సుంకులమ్మ కట్ట మీద కాల్లు బారజాపుకొని కూచోనుండాడు. కె.సి. కెనాలుకు వొక వారెంబడి కొట్టాలు, మట్టిమిద్దెలు ఉండాయి. వాటిల్లో ఉండే ఆడోల్లు, మొగోల్లు తాగినకాడికి తాగినారు.
అరిసినకాడికి అరుసుకుండారు.
గేరి మొగదాల రోడ్డువారగ, రెండు మూడు సాట్ల కొంతమంది ఆడోల్లు సారాయి అమ్ముకుంటా ఉండారు. సన్న సన్న క్యాన్లల్లో, సీసాల్లో సారాయి పోసుకుని కాలువ మీదేసిన రాళ్ల కింద సందుల్లో దాపెట్టినారు. అయిదు రూపాయలకు చిన్న లోటా, పది రూపాయలకు పెద్ద లోటా లెక్కన పోసిస్తుంటారు. దావన బోయేటోలను కూడా తాగేకి రామ్మని పిలుస్తా ఉండారు.
తాగనీక వచ్చినోల్లు అరుసుకుంటా, గప్పాలు కొడతా ఉండారు.
కెనాలు గట్టు మీద నుండి బంగారుపేట మెయిను రోడ్డు దాక సారాయి వాసన గాల్లో తేల్తా ఉంది. అది మామూలు సారాయి వాసన గాదు. ఏదేదో కలిసి కుళ్లి మురిగిపోయిన వాసన. ఆడంతా సుళ్లు తిరుగుతుండాది.
అంతలో ముందు నానా కూతురు 'గుడ్ల' బొంగురు గొంతు పెట్టుకోని శికారి గేరంతా ఏకం జేసింది. 'డొక్కోని' మీదికిపోయి బండబూతులు తిట్టింది. కీకరక అరిసి మీదబడి కొట్టింది.
ఆ టయాన ఆమె తాగిందో లేదో గాని, అప్పటికే తాగినోల్లు రయ్యరయ్య సుంకులమ్మ కట్ట మీదికి వచ్చినారు.
డొక్కో సంగతి మ చెప్పనీక లేదు.
వాడు కుండ ఉన్నది ఎవరైనా యా పొద్దయినా చూసి ఉంటే గదా.
పెళ్లాం మీదికి బాణం పోయినట్లే పోయినాడు. జుట్టుపట్టుకోని కిందపడనూకి కొట్టినాడు. గుమి ఎట్ల లేచెనో గాని లేచె. ఒక్క దొబ్బు దొబ్బితే డొక్కోడు యిరుసుకోని ఆంత దూరాన పోయి పడ్నాడు..........