శిశుపాల వధమ్
ప్రథమ సర్గ
వంశస్థవృత్తము
శ్లో॥ శ్రియః పతి శ్రీమతి శాసితుం జగ
జ్జగన్నివాసో వసుదేవ సద్మని ।
వసన్ దదర్శావతరంత మంబరా
ద్ధరణ్య గర్భాంగభువం మునిం హరిః ॥
ప్రతిపదార్థం: శ్రియః = లక్ష్మీదేవికి, పతిః = భర్త అయినవాడు, జగన్నివాసః లోకాలకు ఆధారమైనవాడు, జగత్ = లోకాన్ని, శాసితుం = పాలించటానికి, శ్రీమతి సంపదలతో కూడిన, వసుదేవ సద్మని = వసుదేవుని గృహంలో, వసన్ = ఉంటూ, హరిః - శ్రీకృష్ణుడు, అంబరాత్ = ఆకాశంనుండి, అవతరంతం = దిగుతున్న, హిరణ్యగర్భాంగ భువం = బ్రహ్మ కుమారుడైన మునిం = నారద మహామునిని, దదర్శ = చూశాడు.
తాత్పర్యం: లక్ష్మీదేవికి భర్త - ప్రపంచాని కాధారమైనవాడు. దుష్టశిక్షణ - శిష్టరక్షణ నిమిత్తం అవతరించిన శ్రీకృష్ణుడు, సంపదకు నిలయమైన వసుదేవుని ఇంట్లో ఉంటూ ఒక రోజు ఆకాశం నుండి దిగుతున్న బ్రహ్మకుమారుడు నారదుణ్ణి చూశాడు. బ్రహ్మదేవుని తొడనుండి నారదుడు పుట్టాడని భాగవతంలో 'ఉత్సంగా న్నారదో జజ్ఞే' అని ఉన్నందువల్ల నారదుడు బ్రహ్మ కుమారుడు. అధికాలంకారం.
అవతారిక: అపుడు జనులు నారదుని ఆశ్చర్యంతో చూడసాగారని చెపుతున్నాడు.
శ్లో॥ గతం తిరశ్చీన మనూరుసారథే:
ప్రసిద్ద మూర్ధ జ్వలనం హవిర్భుజః |
పతత్యధో ధామ విసారి సర్వతః
కిమేత దిత్యాకుల మీక్షితం జనైః ॥.........