ఆశీర్వచనం
కాశీ అంటే ఉత్తరప్రదేశ్ లోని ఒక హిందూ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. భరతవర్షం లో పుట్టిన హిందూ జైన బౌద్ధ శిఖ్ తదితర అన్ని మతాలకి కాశీ పరమ పవిత్రమైన జ్ఞానభూమి, కర్మభూమి. భరతవర్షం అంటే నేటి ఇండియా ను దాటి ఆసియా మొత్తం విస్తరించిన అఖండ భారతం. తుది శ్వాసను విడిచి ముక్తి పథాన నడిచే భక్తులకు కాశీ ఏకైక గమ్యం. అయితే దేశం నలుమూలలలోని ఆస్తికులకు కాశీ పోవడం సాధ్యమయ్యేది కాదు. కానీ కాశీ తో ఆ ఆధ్యాత్మిక సాంగత్యం పొందడానికి, అనుభూతి చెందడానికి, కాశీ వెళ్లిన యాత్రికులు తిరిగి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఒక శివలింగం తెచ్చి ఇంట్లోనో గ్రామంలోనో ప్రతిష్టించి, కాశీ విశ్వేశ్వరుడిగా పూజించేవారు. ఊరందరికీ కాశీ విశ్వేశ్వర దర్శనం లభించినట్టయ్యేది. అందుకే ప్రతి ఊర్లోను మనకి కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ దేశంలోని ప్రతి హిందువు హృదయంలో కాశీకి, విశ్వేశ్వరుడికి ఉన్న హిమశృంగ సమానమైన స్థానం అది.
విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం I
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం II
ఈ శ్లోకంలో గుహ గంగ తో సహా కాశీలోని దైవాలందరినీ స్మరించి, వారి దివ్యత్వాన్ని తలుచుకుని పునీతులవుతారు హిందువులు. కాశీలో అదృశ్య రూపంలో ఉత్తర వాహినిగా ప్రవహించే గుహగంగ తో సహా ముప్పయి మూడు రకాల ప్రధాన దేవతలు, వారి అవతారాలు, కొలువుతీరి ఉన్న కాశీ కంటే దివ్య క్షేత్రం ఇంకేం ఉంటుంది?
వాస్తవానికి లింగాలన్నీ శివ రూపమే అయినా, వాటి ప్రతిష్ట, చరిత్ర, అర్చన విధానాలను అనుసరించి, అవి నెలకొన్న తావుననుసరించి వివిధ పేర్లతో గుర్తింపబడతాయి. ఉదాహరణకి మనః కారకుడైన చంద్రుడి లక్షణాలతో,.....................