ఆద్యంతమంగళమజాతసమానభావం
ఆర్యం తమీశమజరామరమాత్మదేవం,
పంచాననం ప్రబలపంచవినోదశీలం
సంభావయే మనసి శంకరమంబికేశమ్(శివమహాపురాణమ్).
పంచాక్షరీ వైభవం తెలుసుకోవాలంటే జగద్గురువైన పరమేశ్వరుని కృప, అనుమతి ఉండాలి. "పంచాక్షరి గురించి చెప్తే శివుడు సంతోషిస్తాడు" అని నారదుడు పార్వతీదేవితో చెప్పాడు. శివుని యొక్క అయిదు అక్షరాల మంత్రం పంచాక్షరి. ఇది చాలా మందికి తెలిసినదే కదా! అనిపిస్తుంది. బాగా పరిచయం వల్ల దాని విలువ తెలియదు. “అది ఏ విధంగా వచ్చింది? దానికి పెద్దలు ఎన్ని నియమాలు పెట్టారు? దాని విధులు ఏమిటి? దాని వైభవం, అందులో దాగిన అంతరార్థాలు ఏమిటి?” ఇవన్నీ తెలుసుకోవాలి.
'కల్పకోటి శతైరపి'- 'కోటికల్పాల ఆయువు లభించినా పంచాక్షరి వైభవాన్ని విస్తారంగా చెప్పలేం' అని శివపురాణం చెప్తోంది. ఇది అతిశయోక్తి మాత్రం కాదు. పంచాక్షరి ఒక అయిదు అక్షరాలు కూడిక మాత్రమే కాదు. అదొక మహామంత్రం. మంత్రం అంటే 'శక్తిమంతమైన శబ్దము' అని అర్థం. ప్రతి అక్షరమూ శక్తిమంతమైనదే. ఆ శక్తి సాధకునకు అనుభవానికి రావలిసినదే తప్ప... వారు కూడా దానిని నిర్వచించలేరు. అటువంటి దివ్యమైన శక్తి దానిలో దాగి ఉంది.
మంత్ర స్వరూప స్వభావాలు
మంత్రాలు అనేక రకాలు ఉంటాయి. కొన్ని మంత్రాలకు స్పష్టంగా సాహితార్థం తెలుస్తుంది. ఉదాహరణకు - 'నమశ్శివాయ' అంటే... 'శివాయ' అనేది చతుర్థీవిభక్తితో కూడిన శివశబ్దం. 'శివాయ' అంటే శివునకై, 'నమః' అంటే నమస్కారం అని అర్థం. ఇది సంస్కృతంతో పరిచయం ఉన్నవారికి తెలుస్తుంది. ఇలా సాహిత్యార్ధం ఉన్న మరొక మంత్రం 'నమో నారాయణాయ'. అంటే నారాయణునికి నమస్కారం. ఇవి.......................
సామవేదం షణ్ముఖశర్మ