సామాజిక ఇతిహాసాలు
రామరాజుగారి కథలు
భట్టిప్రోలు కథలతో వర్తమాన తెలుగుసాహిత్యంలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధ కథారచయిత నక్కా విజయరామరాజుగారు. వీరు పాతగుంటూరుజిల్లా (నేటి బాపట్లజిల్లా) భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో అంజయ్య, దయమ్మ దంపతులకు జన్మించారు. పేదరికం సృష్టించిన పెను అవరోధాలను అధిగమించి, సమున్నత సంకల్పంతో రామరాజుగారు జ్ఞానపథంలో మునుముందుకు సాగిపోయారు. కష్టజీవులైన తల్లిదండ్రులు అందించిన సంస్కారంతో, భట్టిప్రోలు టీఎంఆర్ ఉన్నతపాఠశాల, గుంటూరు ఏసి కళాశాల సమకూర్చిన విద్యా కళాచైతన్యంతో రామరాజుగారు ఉత్తమవిద్యార్థిగా రాణించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో M.B.,B.S. పూర్తి చేసి, కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో P.G. పట్టా అందుకొని, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్లో చేరి ఎడిషనల్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. వృత్తిరీత్యా నిజామాబాద్ జిల్లా అర్మూర్ లో స్థిరపడ్డారు.
'పరులకష్టము జూచి కరిగిపోవును గుండె' అని కాళోజి అన్నట్టుగా డాక్టర్ గారు సాటిమనిషి దుఃఖానికి మంచుకొండలా కరిగిపోతారు. ఈ రకమైన కరుణాతత్త్వంతో వీరు పరోపకారపరాయణులుగా రూపొందారు. ఎంతోమంది చెవిటి మూగ విద్యార్థుల జీవితాలకు చేయూత నందిస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు నీడనిస్తున్నారు. దీనజనుల సేవలోనే జీవితపరమార్థాన్ని దర్శిస్తున్నారు.
డాక్టర్గారు బాల్యంనుండి ప్రబలమైన కళాభిరుచి కలిగిన వ్యక్తి. అధ్యయనశీలి, సాహిత్యప్రియులు. ప్రముఖ నవలారచయిత డా. కేశవరెడ్డి గారి సాహచర్యంతో వారి రచనల స్ఫూర్తితో 'ప్రౌఢనిర్భర వయఃపరిపాకం'లో.................