ఆది' యందు నారాయణుడుండెను - ఆమెన్!
తాడి ప్రకాష్
కథ చెబుతాం. నవల రాస్తాం. ఒక సినిమా చూస్తాం. ఒక అందమైన ప్రదేశానికో, ఇతర దేశానికో వెళ్ళి ఆ అనుభవాన్ని రాస్తాం. దాన్ని ట్రావెలోగ్ అంటాం.
ఏదైనా చెప్పటమే ముఖ్యం. ఇంతకు ముందు చాలా మంది రాసి ఉన్నారు. ఇంకా బాగా చెప్పగలగాలి. గుచ్చుకొనేలా, హృదయానికి హత్తుకొనేలా.
ఒక వెలుతురు కిరణమేదో గుండెని తాకినట్టూ ఉండాలి. తిరిగి తిరిగీ కాళ్ళు అరిగిన ఈ ఆదినారాయణ అలా అందంగా రాయటంలో చెయ్యి తిరిగిన వాడు. ఏదేశమేగినా, ఎందుకాలిడినా, రోడ్లమీదే నడిచి, చరిత్రని తవ్వి తీస్తాడు. ఆ అనుభూతిని తేలికైన పదాలతో, బరువైన భావంతో, రుచికరమైన వచనంతో మనకి అందిస్తాడు.
విద్య చాలామందికి ఉంటుంది. రసవిద్య మాత్రం కొద్దిమందికే తెలుస్తుంది.
ఈ జిప్పీది సున్నితమైన సెన్సాఫ్ హ్యూమర్.
తిరిగిన దేశాలు ఖండాలు, లోకాలు చాలవన్నట్లు ఈ మధ్య రష్యా వెళ్ళి వచ్చాడు. నలభై రోజులు నాన్స్టాప్ తిరిగాడు. ఆ మరపురాని పర్యాటనానుభవానికి `సైబీరియా బాటసారి' అని పేరు పెట్టుకొన్నాడు
ఆదినారాయణకి ఆడంబరాలు పట్టవు. వేషాలు, ఓవర్ యాక్షనూ గిట్టవు. నిరాడంబరుడైన పాత గ్రీకు తత్వవేత్త, డయోజెనిస్కి ఏకలవ్య శిష్యుడు. ఎక్కడికైనా సరే 'ఏక్ ఛలో' అని పాడుకుంటూ నడిచి వెళ్ళిపోతాడు.
ఓ గిన్నెడు వేడి సూప్, రెండు బ్రెడ్డు ముక్కలు, ఒక పండు చాలు. రోజు నడిచిపోతుంది, ఈ సంచారికి. భుజంమీద సంచిలో రెండు జతల బట్టలే ఉన్నా, ప్రపంచ కళా చరిత్ర అనే పెద్ద లగేజి ఎప్పుడూ ఆయన హృదయంలో పదిలంగా
ఉంటుంది.
మేరా జూతాహై జపానీ,
సర్పే లాల్ టోపీ రూసీ
ఫిలీ దిల్ హై హిందూస్థానీ....