సిగ్మండ్ ఫ్రాయిడ్
జీవితం-కృషి
“భార్యతో ఇంట అడుగుపెట్టాక నాకర్థమైంది... భార్యే లేకుంటే నరకం కూడా వాసయోగ్యమే" నవ్వుతూ అన్నాడు ఫ్రాయిడ్.
మార్తా ఆశ్చర్యంగా “అది హెయిన్ అభిప్రాయం. నువ్వూ దాన్ని నమ్ముతున్నావా! నిజాన్ని దాచేవాళ్లే అతిశయోక్తులు వాడుతారని గెథే అన్నట్లు జ్ఞాపకం!" అంది.
"మార్తా! నేను సామాన్యులలో సామాన్యుణ్ణి. హెయిన్ని విశ్వసించినా విశ్వసించక పోయినా వివాహమైపోతే ఆ జీవితానికే అంటుకుపోతాను. బాధపడవలసివస్తుందను కోను!"
"థ్యాంక్యూ! ఈ వేళ ఇన్నాళ్లకి నన్ను ఒకరైనా మనిషిగా గుర్తించినట్లు అనుభూతి కలుగుతున్నది” అంది మార్తా. నెమ్మదిగా అతని చేతిలో చేయి కలిపి నడుస్తూ “మీరు డాక్టరై ఉండి ప్రాక్టీస్ చేయరెందుకని?”
“రోగులకు సేవ చేయడం గొప్ప విషయమే. కానీ రీసెర్చి అంటేనే నాకిష్టం. ఒక వ్యాధి నయమవుతున్నదంటే దాని వెనుక ఎన్ని వందల మంది పరిశోధన, శ్రమ ఉంటాయి? ఎన్ని ప్రయోగశాలల నిర్విరామ కృషి ఉంటుంది? నాకు అలా రీసెర్చి సైంటిస్టు కావాలన్నదే గాఢమైన కోరిక.”
తన జీవిత భాగస్వామి కాబోయే మార్తాకు ముందే తన మనస్సు తెలిసి ఉండటం మంచిదనుకున్నాడు.
"అలా ప్రయోగశాలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ప్రయత్నాలు ఫలించినవి ఏవైనా ఉన్నాయా?" అంది మార్తా నవ్వుతూ.
“ప్రొఫెసర్ రాబర్ట్ కాక్ క్షయవాధికి కారణమైన సూక్ష్మజీవిని కనిపెట్టాడు. 1844లో డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్ విజ్ పూర్ పెరల్ ఫీవర్'కు కారణం కనుక్కున్నాడు....................................