కథామంజరి శ్రీమతి పోడూరి నాగమణి స్మారక ఉగాది కథల పోటీలో ప్రథమ
బహుమతి పొందింది
తలపాగా
నీటి పారుదల ప్రాజెక్టుకు అనుబంధంగా జలాశయం నిర్మిస్తూ రెండు గ్రామాలని సేకరించింది ప్రభుత్వం.
గత 10-15 రోజుల్నుంచీ ఆ ఊళ్ళని ఖాళీ చేయిస్తున్నారు. వారికోసం రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాలనీ ప్రత్యేకంగా నిర్మించారు. ఆసక్తి కనబరిచిన ముంపు గ్రామాల జనానికి అందులో ఇళ్ళు కేటాయించారు.
నెల రోజుల్నుండీ త్వరగా గ్రామాన్ని వీడి తరలి వెళ్లిపోవాలని ప్రభుత్వాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దాంతో నష్టపరిహారం పూర్తిగా అందకపోయినా సరే, కోర్టులో పరిహార పెంపు కేసులు నలుగుతున్నందున ఆందోళన బాట వదిలేశారు. మరి గత్యంతరం లేదని గ్రహించి మూటా ముల్లె సర్దుకున్నారు.
ఊళ్ళోని 353 గడపల్లో మూడొందల ముప్పై పైచిలుకు తరలివెళ్ళారు. మిగతావారు ఇదిగో ఇప్పుడు వదలలేక వదలి వెళ్తున్నారు. ఆ రాత్రికే ముంపు నీరు వదులుతారనీ, ఊరు సమూలంగా మునిగిపోతుందనీ హెచ్చరించడంతో వూరొదలక తప్పటంలేదు.
ప్రభుత్వం ఏర్పాటుచేసిన టొయోటా మీద, వివిధ బళ్ళ మీద కాందిశీకుల్లా వెళ్తున్నారు. అంతా నీరసంగా నిస్తేజంగా వున్నారు. కని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులిద్దరికీ ఒకేసారి తలకొరివి పెట్టి వస్తున్నట్లుగా వున్నారు.
ఆడవాళ్ళకు ఎక్కడా దుఃఖం ఆగటం లేదు. ఒకర్నొకరు కావలించుకుని బావురుమంటున్నారు. బేలగా చూస్తూనే ఒకర్నొకరు ఓదార్చుకుంటున్నారు.
గ్రామ పొలిమేర దాటుతోంటే ఒక అవ్వ ఒంటేలు వంక పెట్టి వాహనం దిగింది. ఆ మరుక్షణం, "నేను రాను. మీరు పోండి..." అంటూ విసవిసా ఊరివైపు నడవసాగింది.
ఆమె కొడుకూ కోడలూ పరుగున వచ్చి ఆమెని ఆపారు. ఎంత నచ్చచెప్పినా పంతం వీడలేదు. 'పుట్టిన గడ్డని వదల్లేను. ఈ మట్టిలో కలిసిపోతాను' అంటూ నేలమీద చతికిలబడింది కన్నీరు మున్నీరవుతూ.
మిగతా జనమంతా వచ్చారు. కావలించుకున్నారు. కంటనీరు పెట్టుకున్నారు. ఆమెని ఓదారుస్తూనే లేవదీసి తీసుకువెళ్ళారు.
ఎవరి మనస్సూ మనస్సులో లేదు. కన్నీటితో తడవని కన్ను ఒక్కటీ లేదు. వెనక్కెనక్కి తిరిగి 'కడచూపు' చూస్తూ వీడలేక వీడుతున్నారు. దుఃఖం పొగిలి వస్తోంది. గుండె రాయి చేసుకుని భారంగా కదిలారు.
వారంతా ఊరు దాటుతోంటే ఒక పెద్దాయన ఊళ్ళోకి వెళ్తూ కన్పించాడు.
ఆశ్చర్యచకితులయ్యారు. చిత్రంగా చూశారు.
"బాలయ్యలా వున్నాడే” ఒకరు కళ్ళపైన చేయి అడ్డం పెట్టుకుని చూస్తూ అన్నారు..
“బాలయ్యే” అన్నాయి నాలుగు గొంతులు.