నాన్నా నువ్వు సత్యమే చెప్పావు
నాన్నా నువ్వు సత్యమే చెబుతుండే వాడివి
నేల ఎవరి వెంట వెళ్ళిపోదని.
పృధ్వీశులెందరో ఈ భూమి మీద పుట్టారు గానీ
వారెవరూ పృద్వి చిన్న శకలాన్ని కూడా
వెంట తీసుకుపోలేదు.
అన్ని మతాల దేవుళ్ళు
ఈ భూమ్మీద అవతరించారు.
తమ సంతానాన్ని పంపారు.
లేదా ప్రవక్తగానో ప్రవర్తించి పోయారు.
కానీ వాళ్లు కూడా వట్టి చేతులతోనే
సెలవు తీసుకున్నారు.
ఎవరూ ఈ నేలను వెంట
తీసుకుపోలేకపోయారు.
తమ భుజబలంతో రాజ్యాల్ని సామ్రాజ్యాల్ని ఏలినా
భూమీశులెవరూ ఒక్క అంగుళం భూమిని కూడా
వెంట తీసుకుపోలేకపోయారు.
నేల తల్లి తన ఆడ మగ సంతానానికి ఆశ్రయమిస్తుంది
వాళ్ల పురుషార్ధాలను అహంకారాలను భరిస్తుంది.
కానీ ఎవరి వెంట పోదు.
మట్టి తల్లి అందరినీ తనలో కలుపుకుంటుంది.
భూమి మీద వీచే గాలిలో కథలు గాథలు
తనలో కలిపేసుకుంటుంది గాని
అంగుళమంత కూడా తాను
ఎవరినీ అంటిపెట్టుకుని పోదు...............