అల్లం రాజయ్య రాసిన ఈ సైరన్ నవలను చదివితే తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గత నలభై, యాభై యేండ్ల కింద రైతాంగం, ఆదివాసులు, సింగరేణి కార్మిక వర్గపు స్థితిగతులు ఎలా ఉండేవో తెలిసి వస్తాయి. అలాగే ఉద్యమ సంస్థల కార్యకలాపాల వలన శ్రామిక వర్గం చైతన్యం పొందుతూ, సంఘటిత పడుతూ, నెత్తుటి త్యాగాలతో సాగించిన పోరాటాల వల్ల అనేక విజయాలు సాధించుకున్నారనేది అర్థమవుతుంది.
ఉద్యమాల ప్రాంతానికి మధ్యలో నాలుగు రోడ్ల కూడలి లాంటి మంచిర్యాలలో ఉద్యోగం చేసి, రిటైర్మెంటయ్యి మంచిర్యాలలోనే స్థిరపడిన అల్లం రాజయ్య మంచిర్యాలకు నలువైపులున్న ప్రజల బతుకుల్ని ఆ కాలపు విద్యార్థులు, యువకులందరిలాగే అధ్యయనం చేస్తూ వచ్చిండు.
మంచిర్యాలకు ఒకవైపు గ్రామాలూ, పల్లెలతో కూడిన రైతాంగ ప్రాంతం. అక్కడ పాలకుల అండతో కరడు గట్టిన దొరలు భూస్వాములు సాగిస్తూ వచ్చిన దుర్మార్గాలు. భూములు లేక, బువ్వకు లేక, శ్రమకు తగ్గ ఫలితం రాక, వెట్టిచాకిరీలతో, మాన ప్రాణాలకు భద్రత లేక, అర్థ బానిసల్లాగా, “అయ్యా-బాంచన్- దొరా!” అంటూ అనిగి మనిగి బతుకు తుండేటి బడుగు బలహీన వర్గాల గ్రామీణ ప్రజలు మరోవైపు. ముఖ్యంగా దళితులు. ఆనాటి ఆ బతుకులు గుర్తుకస్తే
ఏనాటి కానాడు ఎండ వానల్లోన
చేసి చేసి ప్రాణ మిసిగి పోతున్నాది
కూలి చాలని కూలి ఓరన్నా
దొరల కుక్కలే నయము రా కూలన్న...