వినూత్న ఆర్థిక విశ్లేషణ
ఒక మానవీయ సృజనాత్మక దృష్టి
"సిర్గాపూర్ నుండి వాల్ట్ దాకా (ఓ ఆర్థిక విశ్లేషణ)" అనే ఈ గ్రంథానికి ముందుమాట రాయడం సాహసంతో కూడినదిగా, నేను భావిస్తున్నాను.
"కోటి విద్యలు కూటికొరకే" అనేది నానుడి. మానవుడు పుట్టి ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటూ, నాగరికత వ్యాప్తిని పెంచుతూ చంద్రమండలాన కాలిడినా, అనేక అన్వేషణలు చేస్తూ, స్వర్గతుల్యమైన జీవనానికి తీసుకొని పోతున్నా; ఆకలి, ఆశ, దురాశలు, దుర్గుణాలు తగ్గలేదు. మోసపూరిత పద్ధతులలో ఉన్నత వర్గాలు, సంస్థలు, ప్రభుత్వాలు పని చేస్తున్నందుకు వాపోతాడు రచయిత, శ్రమ లేకుండా సంపాదించే సొమ్మును చోరపూరిత సొమ్ముగా భావించమంటాడు మహాత్మాగాంధీ. యుగాలు మారుతున్నా, వ్యవసాయమునే నమ్ముకున్న వ్యక్తికి గిట్టుబాటు ధర అనేది యిప్పటికీ యివ్వకుండా, వ్యాపార వాణిజ్య వ్యక్తులు, సంస్థలు, కోట్లకు పడగలెత్తడమనేది జరుగుతూ వుంటే న్యాయమా! నీవెక్కడ ఉన్నావంటాడు రచయిత. యంత్రాలు, శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానము అనేవి లేనప్పుడు గ్రామాలలో కడుపునిండా అన్నము, శరీరము నిండా గుడ్డ, నిద్రించడానికి గూడు, మనశ్శాంతి సమృద్ధిగా ఉన్నవి. కాని అవి ప్రవేశించి నగరాలను సృష్టించినాక, నగరాలకు గ్రామాలు బానిసలుగా మారినవి. దేశములో దళారులు, మధ్యవర్తుల శాతం పెరిగి, ప్రతి ఆర్థిక కార్యక్రమములో వారితోనే దేశం నడుస్తుందని తెలియజేయడమయినది. అడుగడుగున దోపిడి, లంచగొండితనము, మోసపూరితమైన పద్ధతులలో సంపాదన చేయడమనే అలవాటయిన సమాజములో మనము ఉన్నామనేది చెపుతూ రచయిత తరచుగా పాఠకుని గుండెను తట్టుతాడు. సిర్గాపూరు గ్రామము నుండి తన ఆర్థిక విశ్లేషణను ప్రారంభించి వాల్ స్ట్రీట్ మార్కెట్ కుదింపులు, ఒబామా ఉద్దీపనాలు ఎందుకివ్వడమయినది వివరించడమయినది. బంగారు నాణాలకన్న, కాగిత కరెన్సీ మానవ మనుగడను పూర్తిగా మార్చివేసిందనేది నిత్య సత్యము. ప్రస్తుతము మార్కెట్లో, రాజకీయాలను, బ్యాంకింగ్ వ్యవస్థను, మానవ నైతిక విలువలను మారుస్తూ వున్నవని వివరించడమయినది. రచయిత అర్థశాస్త్రానికి ఒక కొత్త పదాన్ని పరిచయము..................