చీకటి శిరసున సినీవాలి!
సిరివెన్నెల పేరునూ, కనీసం ఒకటైనా ఆయన సినిమాపాటనూ వినని తెలుగు వాళ్లుండరు. తెలుగు సినిమాపాట చరిత్ర అనే నదీప్రవాహం సిరివెన్నెల ఘట్టం దగ్గర మరో మలుపు తిరిగింది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేను 'తెలుగు సినిమాపాట 'చరిత్ర' అనే సిద్ధాంత గ్రంథాన్ని రాస్తూ తెలుగు సినిమాపాటను ప్రారంభదశ నుండి ఎనభైల దశకం వరకు సుసంపన్నం చేసిన వందలాది కవులలో పదకొండుగురిని మార్గనిర్దేశకులుగా గుర్తించి వారి పక్కన పన్నెండవ కవిగా ఎనభయ్యవ దశకంలో రంగప్రవేశం చేసిన సిరివెన్నెలను చేర్చాను. తొలి తెలుగు టాకీ 'భక్త ప్రహ్లాద' విడుదలయిన 1932 నుంచి అప్పటి వరకు సాగిన సినీగేయవికాసాన్ని సమీక్షిస్తూ ఆ కాలాన్ని వివిధదశలుగా విభజించాను. ఆయా దశలకు క్రమంగా అరుణోదయం, భావోదయం, రాగోదయం, రసోదయం, చంద్రోదయం అంటూ వుదయాలుగా పేర్కొంటూ చివరి దశను (1980-90) 'అయోమయం' అన్నాను. అది తెలుగు సినిమాపాట కొత్త పోకడలు పోతూ, ఎత్తు పల్లాల దారిలో ప్రయాణం చేస్తూ విలువల విషయంలో విమర్శలకు గురవుతున్న దశ గనుక అలా నామకరణం చేయవలసి వచ్చింది. అయోమయం అనే పద ప్రయోగాన్ని కొందరు వెంటనే జీర్ణించుకోలేకపోయినా అధికశాతం అమోదించారు. అలా సినీగేయ సాహిత్య విహాయసంలో మబ్బులూ మెరుపులతో చీకటి ముసురుకొంటున్న వేళ 'సినీవాలి''గా ఆశలను రేపిన 'సిరివెన్నెల'ను మరో మార్గదర్శక కవిగా గుర్తించాను. నా ప్రతిపాదన వాస్తవమని కాలం రుజువు చేసింది.
ప్రాచుర్యం పొందిన మొట్టమొదటి చిత్రానికే (సిరివెన్నెల) అన్ని పాటలను రాసే 'సింగిల్ కార్డ్' అవకాశాన్ని పొందడమే గాక, మొదటిపాటకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నందిపురస్కారంతో పాటు కళాసాగర్ మొదలైన వివిధ సాంస్కృతిక సంస్థల పురస్కారాల నందుకోవడం, అంతటితో ఆగక వరసగా మూడు సంవత్సరాలపాటు నందిపురస్కారాల (86, 87, 88 సంవత్సరాలకు) నందుకొని హాట్రిక్ సాధించిన ఏకైక సినీకవిగా ఘనత వహించడం అన్నిటికీ మించి అందరికీ తెలిసిన మొదటి చిత్రం పేరే పౌరుషనామమై యింటిపేరు మరుగుపడి 'సిరివెన్నెల' పేరుతో ప్రాచుర్యాన్ని పొందడం... అదిరిపోయే ఆరంభంతో సిరివెన్నెల తన అర్హతను చాటుకున్నారు. తన మూడున్నర దశాబ్దాల సినీగేయ...............