"ఏమ్మా! ఎవరురా నిన్ను అంత బాధ పెట్టారు? నాన్న దగ్గరకు వచ్చి ఇంత నటించిపోతున్నావు?” అని నా నవ్వుల వెనకాల కన్నీటిని కనిపెట్టే తండ్రి ఎంత
మందికి దొరుకుతారు?
మా అమ్మ నాకు మూడున్నర ఏళ్లకు చనిపోయారు. మా బామ్మల గారాబంలో పాడైపోకుండా నాకు ప్రేమతో రక్షకుడు, శిక్షకుడు నాన్నే అయ్యారు.
మా తాతగారు శ్రీ గాలి సుబ్బారావుగారు మానికొండ జమిందారులు అని చెప్పుకునేవారు. కానీ, పుట్టిన ఆరు నెలలకే తల్లిపోవడంతో మా నాన్నగారిని మంత్రిప్రగడ లక్ష్మీదేవమ్మగారు పెంపకం తీసుకోవటం వలన పెద్దవుటపల్లిలో పెరిగారు. మానికొండ బాలమ్మ వీరి కులదేవత అవడం వలన, వీరి తండ్రి గారు బాలా త్రిపురసుందరి ఉపాసకులు అవడం వలన వీరికి "బాలసుందరరావు” అని పేరు పెట్టారట. ఆ ఆచారం వలన మా చిన్న అమ్మాయికి బాల మాధవి, మా మనమరాలుకి బాల సావిత్రి చిన్మయి అని పేరు పెట్టాము.
మా అమ్మ వీరంకిలాకులకు ఓవర్సీర్గా పని చేసిన శ్రీ వేమూరి రంగ నాయకులుగారి అమ్మాయి మధుర మీనాక్షి.
నాన్న మే 31, 1913న జన్మించారు. సెప్టెంబర్ 20, 1974 న కాన్సర్తో మరణించారు.
నాకు తెలిసి ఆయన పోయేనాటికి 30 పూజా గృహల్లో ఆయన ఫోటో పెట్టుకొని పూజించేవాళ్ళు ఉన్నారు. ఆయన పోయిన తర్వాత ఆయన రాసిచ్చిన మందుల చీటి దాచుకొని, “మరొక డాక్టర్ దగ్గరకు వెళితే... వారు మా శరీరతత్వం బాలసుందరరావుగారిలా శ్రద్ధగా పట్టించుకోరు" అని అవే మందులో, ఆ కాంబినేషన్ మందులో వాడేవారు ఆయన పేషెంట్స్. అట్లాంటివారు ఉండేవారో. చాలా మంది దృష్టిలో ఆయన ధన్వంతరి. ఫీజు తీసుకోని ఈ డాక్టర్ చాలా మంది ధనవంతులకు ప్రాణమిత్రుడు, కడు బీదవారికి ఆత్మీయుడు.
ఆ తరంలో ఎంతమంది
నాన్నగారితో పాటు ప్రాక్టీస్ ప్రారంభించిన చాలా మంది డాక్టర్స్ మేడలు... మిద్దెలు కట్టేశారు... "ఇంత మంచి వైద్యులు.... ఫీజు ఎందుకు తీసుకోరు?!".......