సౌందరనందం చదివేముందు గౌతమబుద్ధుని జీవితాన్ని గురించి కొంతైనా తెలిసికోవాలి. అందుకు మనకు ఐదు పుస్తకాలే ఉన్నాయి. ఇవి బాగా ప్రాచీనమైన రచనలు. వీటిలో వీటికి కొన్ని అభిప్రాయ భేదాలుకూడా ఉన్నాయి. అవి 1. మహావాస్తు, 2. లలితవిస్తర, 3. అశ్వఘోషుని బుద్ధచరిత్ర, 4. నిదానకథ, 5. అభినిష్క్రమణసూత్ర. ఇవేకాక సంస్కృతం లోను, పాళీభాష లోను కొన్ని సంఘటనలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినిబట్టి బుద్ధుని చరిత్ర ఈవిధంగా చెప్పుకొనే అవకాశం ఉంది.
బుద్ధుని అసలుపేరు సిద్ధార్థుడు. వీనిది శాక్యవంశం. శాక్యులు కోసల రాజధాని సాకేతనగర వాసులు. సాకేతంనుండి హిమాలయపర్వత సానువులలోనికి ప్రవాసం పొందారు. సాకేతులే శాక్యులయ్యారేమో! వీరక్కడ కపిలవస్తు నగరం నిర్మించుకున్నారు. శ్రీలంక వ్రాతలనుబట్టి కపిలవస్తును ఏలిన తొలిరాజు జయసేనుడు. అతని కొడుకు సిహాహనుడు. అతని కొడుకు శుద్ధోదనుడు. శుద్దోదనుడికి ఇద్దరు భార్యలు. వారు మహామాయాదేవి, మహాప్రజాపతి. వారిద్దరూ దేవదహుని కుమారుడైన అంజనుడి కూతుళ్ళు.
క్రీ.పూ.623లో మహామాయకు సిద్ధార్థుడు జన్మించాడు. ప్రజాపతికి నందుడు పుట్టాడు. వీరి తండ్రివైపువారు, తల్లివైపువారు గౌతమకుటుంబంవారట. అందుకే సిద్ధార్థుని గౌతమబుద్ధుడన్నారు తరువాత. సిద్ధార్ధునే సర్వార్థసిద్ధుడనీ, అంగిరసుడనీ, శాక్యముని అనీ బౌద్ధులు పిలుస్తూంటారు. సిద్ధార్థుడు పుట్టిన వారానికే తల్లి మహామాయాదేవి మరణించింది. తరువాత ప్రజాపతీదేవే సిద్ధార్థుని పెంచి పెద్దచేసింది.
పుట్టిన యాభైరోజులకు నామకరణ మహోత్సవం జరిపారు. అప్పుడా కుమారునికి పెట్టిన పేరు సర్వార్థసిద్ధుడు లేక సిద్ధార్థుడు. ఆరోజున నూటయెనిమిది మంది బ్రాహ్మణులు వచ్చారు. వారిలో ఎనిమిదిమంది పుట్టుమచ్చలను చూచి జాతకం చెప్పారు. ఏడుగురు బాలునిచూచి ఇతడు అయితే చక్రవర్తి కాగలడు లేదా మహాజ్ఞాని అవుతాడని చెప్పారు. ఎనిమిదో బ్రాహ్మణుడు మాత్రం మహాజ్ఞాని కావడం తప్పదన్నాడు. తండ్రికిది రుచించలేదు. అలా కాకుండా ఏదైనా మార్గం చెప్పమన్నాడు. అందుకా బ్రాహ్మణుడు ఇతడు సన్యాసి కాకుండా ఉండాలంటే ఇతనికి ముసలివాడుకాని, రోగగ్రస్థుడుకాని, మృతమానవ కళేబరం కాని, మరొక సన్యాసికాని కనబడకుండా చేయమన్నాడు. రాజు ఆవిధంగానే తనపరివారాన్ని ఆజ్ఞాపించాడు...................