జరెవ్ డాక్టరు
జరీక్ కు శనివారం మామూలుగా రోజూ రోగులను చూసే సమయంకంటే తక్కువ సమయం వుంటుంది. పంట కోతల కాలం మొదలైంది. ఈ రోజుల్లో సమిష్టి వ్యవసాయదార్లు తమ డాక్టరుకు చాలా అరుదుగా శ్రమయిస్తుంటారు. పొలాలకు వెళ్లేప్పుడు తీసుకువెళ్లే మందుల సంచీని వెంట పెట్టుకొని అన్నిటికంటే సమీపంలో వున్న ఫీల్డ్ స్టేషన్లను ఒక సారి తిరిగి రావాలని బయల్దేరింది డాక్టర్ జరీక్. స్వల్పంగా గాయపడ్డవారికి చికిత్స చేసింది. ధాన్యం నూర్చే కళ్లం వద్ద పనిచేస్తున్న వాళ్ల కళ్లల్లో సాధారణంగా నలకలు పడుతుంటాయి కాబట్టి, ఆమె కళ్లు కడిగే మందులను తీసుకొని ఆ ధాన్యం నూర్చే కళ్లం వద్దకు వెళ్లింది. వాళ్లకి ఆ మందులిచ్చి, జలజలా ప్రవహిస్తున్న ధాన్యపు రాశులను చూస్తూ ఆ దృశ్యాన్ని మెచ్చుకుంటూ అలాగే నిలబడిపోయింది జరీక్.
“జరీక్! ఇలారా!” అని నల్లని వెంట్రుకలతో పొట్టిగా వున్న అస్రాం పిలిచింది. ఆమె భుజాలనిండా, తలనిండా దుమ్ము దట్టంగా నిండిపోయి వుంది.
"జరీక్! నువ్వు కూడా ఒక చెయ్యి అందించు!" అని కొత్త ధాన్యాన్ని సంచుల్లోకి నింపుతోన్న కొంతమంది స్త్రీలు అన్నారు. వాళ్లంతా కూడా జరీక్ చిన్ననాటి స్నేహితులు. ఆమె తన డిగ్రీని తీసుకోక ముందు వాళ్లతోపాటు ఆ ధాన్యం నూర్చే కళ్లంలోనే తరచూ పనిచేసింది. ఇప్పుడు చేయలేదు తన పనులు తనకే వున్నాయి....................