ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి
భగవద్గీత వ్యాఖ్యానం- పరిచయం
కొత్త సచ్చిదానంద మూర్తి గారు శ్రీ మద్భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని 15-16 సం||రాల ప్రాయంలో రచించారు. ఇది షుమారుగా 536 పేజీలతో కూడినది. ఈ పుస్తకం వ్రాయటానికి ఆయన అయిదు మాసాలు తీసుకున్నారు. మూల గ్రంథంలో వేణువు నూదుతున్న శ్రీకృష్ణుడు, దానిక్రింద 'దసాంగ్ ఆఫ్ ద సెలెస్టియల్' అని ఉండటాన్ని బట్టి, దానిని ఉపశీర్షికగా ఎంచుకున్నారనిపిస్తుంది. 'దివ్యగానమనే’ భగవద్గీతలను శ్రీకృష్ణుడు తనకు ఉత్తరాధికారి అయిన అర్జునునకు ఉపదేశించినప్పటికీ దానితో మనుష్యులు నిత్యానిత్య కర్మలను ఏ విధంగా అనుష్ఠానించవచ్చో శ్రీకృష్ణుడు పేర్కొనడం చేత అధ్యయనం చేస్తున్నంత సేపు లౌకిక అలౌకిక భావాలు నదిలోని నిరంతర తరంగాల వలె చదువరులను స్పృశించుతూ ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ గ్రంథం మొదటగా 1941 సం॥లో ప్రచురింపబడింది.
శ్రీకృష్ణనామము యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, కృష్ ధాతువునకు ఆకర్షించునది అని అర్థమనీ, 'ణ' అనునది ఆనందం యొక్క వాచకం కాబట్టి, కృష్ణుడు అనగా అందరినీ పరవశింపచేయువాడు లేదా ఆహ్లాదపరుచువాడనేది కూడ రచయిత వివరించారు.
యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు గీతోపదేశం ఎలా చేశాడనే దాని గురించీ, శ్రీమద్భవద్గీత మహత్త్వం గురించి కూడ రచయిత తన వ్యాఖ్యానంలో వివరించారు. ఆ సమయంలో నిత్యానిత్య విజ్ఞానం, భోగములందు ఆసక్తి లేకపోవుట, నిగ్రహం, జ్ఞానమందు కోరిక అర్జునునకు కల్గినవి కాబట్టి గీతోపదేశం చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఇక గీత మహత్త్వం గురించి, ఎట్టి వారికైనా దుఃఖం కల్గితే దేని చేతనూ పోగొట్టలేము. కానీ అర్జునునికి కలిగిన దుఃఖము గీత బోధచే నదృశ్యమయింది................