సూర్యుని అవతారము కశ్యపమహర్షి పత్ని 'అదితి' గర్భము నుండి సూర్య భగవానుడు అవతరించెను. ఇందువలన ఇతనిని "ఆదిత్యుడు” అని అందురు. కశ్యప పుత్రుడైన కారణమున "ఇతనిని "కాశ్యపుడు" అనియు అందురు. కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు కలరు. మొదటి భార్య 'అదితి', రెండవ భార్య 'దితి' అదితి నుండి దేవతలు, దితి నుండి దైత్యులు జన్మించిరి. రాను రాను అధికారమునకు వారిలో విరోధము ఉత్పన్నమయ్యెను. దైత్యులు, దానవులు కలిసి దేవతలపై దురాక్రమణ గావించిరి. దేవతలు ప్రాణ సంకటమున పడిరి. ఇది గాంచిన అదితి కశ్యపులు సూర్య శక్తిని ఉపాసించిరి. సంతుష్టుడైన సూర్యుడు వారిని వరమడుగమనెను. అప్పుడు అదితి "ప్రభూ! మీరు దేవతలను రక్షించుడు” అని కోరగా, సూర్యుడు "చింతించకుము, విశ్వమంతటా వ్యాపించియున్న నా తేజస్సును వెయ్యి కిరణములుగా చేర్చి నీగర్భమందు స్ధాపించెదను. అనంతరము దేవ రూపమున జన్మించి నీ సంతానముల కష్టము తొలగించెదను”. అని చెప్పగా అదితి సంతసించెను. సూర్య శక్తి ఆమె గర్భమందు స్థాపించబడెను. అనంతరము అదితి గర్భము దాల్చెను. తన సంతానమునకు మేలు కలుగవలెనని అనేక విధములైన వ్రతములు చేయుచూ ఉపవాసములు చేయుచుండెను. ఇది గాంచిన కశ్యప మహర్షి క్రోధముతో ఇట్లనెను. “నీవు గర్భవతివి. నీవు సుఖముగ, బలముగ నుండవలెను. అట్లుగాక ఉపవాసములుండి గర్భమందున్న బిడ్డను పాడు చేయదలచితివా? ఇదెట్టి వివేకము”? అదితి శాంత స్వరూపముతో "స్వామీ! ఈ గర్భాండము మీరిచ్చినది కాదు. సాక్షాత్తు సూర్యశక్తి ప్రసాదము. ఇది మన శత్రువులందరిని సంహరించును. మీరు ధైర్యముతో ఈ తేజస్సును, దీని పరాక్రమమును గాంచుడనుచూ అదితి అపానవాయు వేగముచే తన గర్భాండమును పరిత్యాగము చేసెను. బ్రహ్మాండములందు నిప్పులు చెలరేగెను. సమస్త బ్రహ్మాండములు మంటలతో ఆ తేజస్సుతో సమస్త మాడిపోసాగెను. కశ్యప మహర్షి వేదమంత్రములతో గర్భాండమును స్తుతించసాగెను. అప్పుడు ఆ అండము పగిలి దాని నుండి ఒక సుదర్శన బాలుడు జన్మించెను. ఈ బాలుడే సూర్య నామముతో దేవతలకు నాయకుడయ్యెను. వీని నేతృత్వములో దేవతలకు విజయము లభించెను. సూర్యుడు విశ్వ నియంత అయ్యెను........................ |