పుస్తక పూజ గురుచరిత్రమును పారాయణముచేయువారు స్నానమొనర్చి శుచిర్భూతులై కులక్రమముగా సంప్రాప్తమైన సంధ్యావందనము మొదలగు నిత్యకర్మల యధాశక్తి చేసి సూర్యునకు, గణపతికి, గురుమూర్తికి గాని శ్రీదత్తాత్రేయులవారి చిత్రపటమును గాని విగ్రహముగాని లేక వారి పాదుకల గాని తమ కభిముఖముగా పీటమీదయుంచి పూజాద్రవ్యముల కుడి ప్రక్కనయుంచుకొని ఈ క్రింది విధమున గ్రంధమునకు పూజిచేసి అనంతరము యథాశక్తి ఒక అధ్యాయమునకు తక్కువ లేకుండా పారాయణము చేయవలెను. నిత్యము పారాయణ చేయు నియమము గలవారు ఒక రోజున ఏమియైన ఇబ్బందివలన పారాయణ జరుగనిచో ఆ రోజు పారాయణము మరురోజున కలిపి చేయవచ్చును. దత్తాత్రేయ మంత్రము గురుముఖమున ఉపదేశము పొంది జపించుట శ్రేయస్కరము. ఆచమ్య 3 సార్లు ఆచమన మొనర్చి సంకల్పము చెప్పుకొని ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ మను సకలా భీష్ట సిద్ధార్థ్యం... నామధేయః అహం గురుచరిత్ర పారాయణం కరిష్యే అనిచెప్పి ఉదకము స్పృశించవలెను. ముందుగ - శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతాయే || అని గణపతి ప్రార్ధన చేసి ఒక పుష్పము తీసికొని గురుచరిత్రమును త్రిమూర్త్యాత్మక శ్రీ దత్తాత్రేయుల వారుగా భావించి గురుచరిత్రా కారేణ శ్రీ త్రిమూర్త్యాత్మక శ్రీ దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం | భక్తాభీష్టప్రదం వందే గ్రంధరూపేణ సంస్థితం ॥ |