కళాగౌతమి
కళాగౌతమి (తెలుగు భాషాభివృద్ధి సమితి) 1992లో శ్రీమతి భానుమతి రామకృష్ణచే ప్రారంభింపబడింది. అప్పటి నుండి తెలుగు భాషను ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పలువురి పండితుల నాహ్వానించి ప్రాచీన, ఆధునిక సాహిత్యంపై ఉపన్యాసముల నేర్పాటు చేస్తున్నాం. ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల విద్యార్థులకు పద్య పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నాం.
కళాగౌతమికి అనుబంధంగ 'రచయితల సమితి' 2004లో ఏర్పాటు చేశాము. యువతను ప్రోత్సహిస్తూ వారు రచించిన వ్యాసములు, కథలు, కవితలు, గేయములు సరిదిద్ది పలు పత్రికలకు పంపుటద్వారా ముద్రణ కల్పించి, రచనలో అనుభవము కల్పిస్తున్నాం.
రచయితలను మరింత ప్రోత్సహించడానికి 2010లో 'శ్రీకళాగౌతమి' తెలుగు భాషాభివృద్ధి మాసపత్రికను ప్రారంభించడం జరిగింది. తద్వారా భాషపైన, సాహిత్యంపైన ఆసక్తి కలిగిస్తూ వివిధ వ్యాసములు, కవితలు ప్రచురించడం ద్వారా భాషసేవ జరుపుతున్నాం.
రచయితలు తమ రచనలను ముద్రించుకోవడానికి సహకరిస్తూ పలు రచనలను ముద్రించడం, వాటి ఆవిష్కరణలను ఏర్పరచడం చేస్తున్నాం. ప్రతినెల రెండవ ఆదివారం రచయితల సమితి ద్వారా సమావేశం ఏర్పరచి రచయితల రచనలను ప్రోత్సహిస్తున్నాం.
'శ్రీకళాగౌతమి' పత్రికలో ప్రారంభంనుండి ముద్రిస్తున్న 'పద్యం చెరగని సత్యం పద్యం తరగని ధనం'లో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలోని యామునాచార్యప్రభు రాజనీతిని ప్రతినెల ముద్రించటం జరిగింది. దానిని పుస్తకరూపంలో రజతోత్సవ సందర్భంలో ముద్రించటానికి మాకు అవకాశం కల్పించిన ప్రాచార్య శలాక రఘునాథశర్మగారికి పాదాభివందనములతో కృతజ్ఞతలు తెలుపు తున్నాము. తెలుగు భాషాభిమానులైన మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి అంకితమివ్వడం మాకు ఆనందదాయకం..................