ప్రథమ స్కంధం
సత్రయాగంలో సూత మహాముని
పవిత్రమైన నైమిశారణ్యంలో సత్రయాగం జరుగుతోంది. వెయ్యేళ్ళపాటు కొనసాగే సుదీర్ఘ యజ్ఞం అది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం శౌనకుడు మొదలైన మహర్షులు అక్కడ సత్రయాగాన్ని చేస్తున్నారు.
ఆ సందర్భంగా ఆ వైష్ణవ క్షేత్రానికి సకల పురాణవేత్త అయిన సూత మహాముని వచ్చాడు. ఆయనకి మునులందరూ సాదరంగా అతిథి మర్యాదలు చేసి కూర్చోబెట్టారు. తర్వాత ఆ మహాత్మునికి ఎదురుగా శౌనకాది మునులందరూ కూర్చున్నారు.
"మహామునీ ! వ్యాసమహర్షి రచించిన పురాణాల్ని నీ తండ్రి రోమహర్షణుని ద్వారా తెలుసుకొని, వినేవారికి ఆనందం కలిగించేలా చెప్పగల నేర్పు నువ్వు సాధించావు.
కలియుగంలోని పాపాలన్నింటినీ తొలగించి మోక్షాన్ని ఇచ్చే పరమాత్మ శ్రీ మహావిష్ణువు. ప్రతిక్షణం ఆయననే కీర్తించి తరించిన పరమభక్తుల గాథల్ని, ఆ నారాయణుని అవతార విశేషాల్ని నువ్వు చెబితే వినాలని మాకెంతో కుతూహలంగా ఉంది" అని మునులు............