వాల్మీకి మహర్షి
శ్రీమద్రామాయణం
బాలకాండం
దశరధుని ధర్మపాలన
సరయూ నదీ తీరంలో కోసల దేశం ఉంది. దానికి రాజధాని అయోధ్యా నగరం. భూమండలాన్ని పాలించిన రాజులందరికీ మూలపురుషుడు మనువు. శత్రువులెవరూ జయించటానికి వీల్లేనంత పటిష్ఠంగా ఆయన అయోధ్యని నిర్మించాడు.
ఆ నగరం పొడవు పన్నెండు యోజనాలు, వెడల్పు మూడు యోజనాలు. అక్కడ ధనధాన్యాలకి, సుఖశాంతులకి లోటు లేదు. అందమైన అరుదైన నగరం అయోధ్య. దేవేంద్రుడు అమరావతిని పాలించినట్టు దశరథుడు కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు.
పరిపాలన చక్కగా చేయడానికి ఎనిమిది మంది మంత్రులు దశరథుని కొలువులో ఉన్నారు. మహర్షులైన వసిష్ఠ - వామదేవులు మహారాజుకి ప్రధాన పురోహితులు. నమ్మకస్తులైన గూఢచారుల ద్వారా దేశ - విదేశ పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనిస్తూ అధర్మానికి, అన్యాయానికి తావులేకుండా దశరథుడు కోసలని పాలిస్తున్నాడు.............