సుందరకాండ పారాయణవల్ల లౌకిక - అలౌకిక ప్రయోజనాలు చాలా ఉన్నాయనేది భారతీయులందరి విశ్వాసమూను. నామటుకు నేను ఒక మనశ్శాంతినీ ఒక ఆత్మవిశ్వాసాన్ని ఈ సుందరకాండ పారాయణవల పొందుతున్నాను. ఇది ఏ భేషజమూ లేకుండా చెబుతున్న స్వానుభవం. కషసుఖాలనేవి ఎవరికైనా నిత్య జీవితంలో తప్పవు. కానీ వాటివల్ల మనస్సు చెదిరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత మాత్రం మనదే. ఇందుకు నాకు ఉపకరిస్తున్న సాధనం ఈ సుందరకాండ పారాయణం. ఇటీవల ఇది నన్ను మరీ ఆదుకుంది. మా వంశంలో నాకు తెలిసి మూడు తరాలుగా ఈ పారాయణ సాగుతోంది. మా తాతగారు చేసేవారట. మా నాన్నగారు కొనసాగించారు. సుమారుగా నా ముప్పయ్యవయేట ఈ బాధ్యతను నాకు అప్పగించారు. ఇప్పటికి నేను సాగిస్తున్న ఈ పారాయణ వయస్సు పాతిక సంవత్సరాల పైమాట. అయితే నేను ఒక సుందరకాండతోనే ఆగక అభిరుచికొద్దీ మొత్తం రామాయణాన్ని పారాయణ చేశాను. అదీ ఇదీ ఎన్నో ఆవృత్తులు అయ్యాయి, అవుతున్నాయి. పరం మాట దేవుడెరుగు, ఇహంలో ఒక మహాకావ్యాన్ని పలు పర్యాయాలు ఆస్వాదిస్తున్న అనుభూతి – ఇదొక్కటి చాలు, కొండంత సంతృప్తి
మొత్తం రామాయణాన్ని తెలుగుచేసి వచన రూపంలో పాఠకలోకానికి అందించాను - కవితామయమైన శ్లోకాలను ఉదాహరిస్తూ. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్క సుందరకాండను తెలుగు చేసి నేనూ మీకు అందిస్తున్నాను. ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దీనిని కూడా ఆ రామాయణం, దేవీ భాగవతం, దత్తాత్రేయ గురుచరిత్రల్లా గానే అందంగా ముద్రించి - పెద్ద వయస్సులవారు సైతం చదువుకునేందుకు వీలుగా పెద్ద అక్షరాలతో ముద్రించి అందిస్తున్న వి.జి.యస్. పబ్లిషర్స్ అధిపతి శ్రీ శిరం రామారావు గారిని మరొకసారి మనసారా అభినందిస్తున్నాను. అంతా 'రామా'నుగ్రహం.