శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః
శ్రీ మహాభాగవతము
దశమస్కంధము - మొదటి భాగము
(యథా మాతృకము; సరళ వ్యావహారికంలో)
శ్రీ మహాభాగవత దశమస్కంధ మొదటి భాగాన్ని బమ్మెర పోతనామాత్యుడు శ్రీరామచంద్రునికి వినిపిస్తూ, పరమేశ్వరుని వింటిని విరిచిన మహానుభావా, ఇంద్రాది సమస్త దేవతల చేతా ప్రశంసింపబడిన యుద్ధము గావించిన ప్రభూ, కకుత్సవంశా భరణా, నిండు పున్నమి చంద్రుని వంటి నిర్మలమైన కీర్తిగల మహనీయా! మహనీయ గుణశ్రేష్ఠులైన శౌనకాది ముని శ్రేష్ఠులకు సకల పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి అనంతర భాగవత వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు.
శ్రీకృష్ణ కథా ప్రారంభము
అంతవరకూ శ్రీ మహాభాగవతాన్ని శ్రద్ధతో వింటూ వస్తున్న పరీక్షన్మహారాజు |శుక మహర్షితో మహర్షిసత్తమా! సూర్య చంద్ర వంశాల విస్తరణమూ, ఆ వంశాలలోని ప్రభువుల పాలనా విశేషాలను, వైశిష్ట్యాన్ని, నా మనసుకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగే విధంగా చెప్పుకువచ్చారు. అదలాగు కదా! మరి సకలలోక ప్రభువు శ్రీ మహావిష్ణువు, పావన యాదవ వంశంలో ఎందుకు జన్మించినట్లు? అలా జన్మించి, ఆయన ఏయే సమయాల్లో ఏమేమి చేశాడో తెలుసుకోవాలని నాకెంతో కోరికగా వుంది. అలా ఎందుకంటారా! మీకు తెలియంది కాదుగదా! అది సంసార దుఃఖం నుండి విముక్తి కలిగిస్తుంది. దానికి అదే తగినమందు. వింటుంటే మనసుకు ఎంతో హాయి గొలుపుతుంది ! మోక్షం కోరుకునే వారికి, దానికి తగిన ఆశ్రయమూ, ఆధారమూ శ్రీకృష్ణదేవుని వృత్తాంతాన్ని వినటమే ! ఎవడో పశుహింస చేసే కటికవాడు...............