శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః
శ్రీ మహాభాగవతము
నవమస్కంధము
(యథా మాతృకము; సరళ వ్యావహారికంలో)
శ్రీ మహాభాగవత నవమస్కంధాన్ని పోతనామాత్యుడు శ్రీరామచంద్రునికి వినిపిస్తూ : సౌందర్యమూర్తీ ! మహర్షుల పూజలనందుకొనే మహనీయా! సాగరాన్ని కట్టడి చేసిన అస్త్రసంపద గల మాననీయా ! లోకహితాన్ని కోరే విద్వాంసుల కార్యసాధనకు కంకణం కట్టుకుని, అనంతమూ, వైభవోపేతమూ అయిన కీర్తిని మూటగట్టుకున్న మహోన్నతమూర్తి! శ్రీరామచంద్రప్రభూ ! సద్గుణ సంపన్నులైన ఆ మునివర్యులతో, సకల పురాణాలు, అందలి రహస్యాలూ సాకల్యంగా తెలిసి, విశదపరచగల వివేకసంపన్నుడు సూతమహర్షి ఇలాగన్నాడు.
మహనీయులారా ! అలా నిరాహారియై నిర్యాణం కొరకు వేచివున్న పరీక్షిన్మహారాజు శుకమహర్షిని చూస్తూ ఇలాగన్నాడు. మహానుభావా ! వ్యాసమునీంద్రకుమారా! నీ దయ వలన మనువులూ, వారి చరిత్రలూ, వారి వారి కార్యకలాపాలూ, ఇంతకు ముందే సాకల్యంగా తెలిసికొన్నాను. అలాగే మన్వంతరంలో మాధవుని కార్యకలాపాలను, కనపరచిన లీలలను గురించీ విన్నాను. పోయిన కల్పాంతంలో ద్రవిడ దేశాన్నేలిన సత్యవ్రతుడనే ప్రభువు విష్ణుదేవుని ఆరాధించి తత్త్వజ్ఞానాన్ని పొంది, పిదప సూర్యదేవునికి వైవస్వతుడనే పేరుతో జన్మించి మనువైన విషయమూ తెలుసు. అతనికి ఇక్ష్వాకుడూ మున్నగు పదిమంది కుమారులు జన్మించారని చెప్పగా విన్నాను. వారి వంశం ఎలా వర్ధిల్లింది ? వారిలో కాలం చెల్లి వెళ్ళిపోయినవారు, ఇప్పుడున్నవారు, ముందు రాగలవారు ఎవరు? వారి వారి విశేషాలు మనసారా చెప్పవలసిందిగా కోరుతున్నాను. అలా మీరు సూర్యవంశపు....................