అజంతా ఎల్లోరా, ఖజురాహో వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ శిల్పసౌందర్యాన్ని చూసి వేనోళ్ల కొనియాడతాం. అంతెందుకు, ఆలయానికి వెళ్లినా ఆ దేవుని మూర్తిని చూసి అప్రతిభులవుతాం. అలాగే ఏదైనా అందమైన భవనాన్ని చూసినా, అలాంటి భావనే కలుగుతుంది మనకు. అయితే, వాటి నిర్మాణ విశేషాలను మాత్రం అంతగా గమనించ(లే)ము. ఒకవేళ గమనించినా, దాని గురించి వివరించే వాళ్లు మనకు అందుబాటులో ఉండరు.
ఈ లోటును పూరించడానికా అన్నట్లు ఆగమశాస్త్ర పండితుడు, శిల్పశాస్త్ర ప్రవీణుడు, శ్రీశైలప్రభ అనే ధార్మిక పత్రికకు సహాయ సంపాదకులుగా పని చేస్తున్న కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య శ్రీ మయమత శిల్పశాస్త్రం' అనే గ్రంథాన్ని సంస్కృతం నుండి అనువదించి మనకందించారు. మయమతమనగానే మనకు మహాభారతంలోని మయసభా సన్నివేశం కదలాడడం కద్దు. విశ్వకర్మ కుమారుడైన మయబ్రహ్మ పాండవులకు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి ఇచ్చిన శిల్పశాస్త్రాచార్యుడు. -
తెలుగునాట మయమహర్షి రచించిన గ్రంథాలకు ఎంతో ప్రాచుర్యం ఉన్న నేపథ్యంలో మయమతమనే ఈ గ్రంథాన్నే వివిధ భాగాలుగా విభజించి, వాటిలో ప్రథమంగా ప్రతిమాలక్షణమనే - అధ్యాయాన్ని చక్కటి - వాడుక భాషలో - అందించారు బ్రహ్మాచార్య, ఆలయాలలోనూ, ఆలయ ప్రాకారాల పైనా అగుపించే వివిధ దేవతా ప్రతిమలను ఎలా నిర్మించాలో సచిత్రంగా వివరిస్తోంది ఈ గ్రంథం.
ప్రస్తుతం లభిస్తున్న శిల్పశాస్త్ర గ్రంథాలన్నింటిలోనూ మయబ్రహ్మ విరచితమైన శిల్పశాస్త్రమే ప్రాచీనమైనది. ఇది ఆలయ ప్రతిష్ఠలకు సంబంధించినది. నూతనంగా దేవాలయ నిర్మాణం చేసేవారికి, ఆలయ జీర్ణోద్ధరణ చేసే అధికారులకు, శిల్పశాస్త్ర విద్యార్థులకు కరదీపిక వంటిది.
- డి.వి.ఆర్. భాస్కర్
(సాక్షి ఫ్యామిలీ)
04-02-2018