నాదజ్యోతి, వైదికగాయక
శ్రీ ముత్తుస్వామి దీక్షితులు
సంగీతలోకంలో త్యాగరాజాది వాగ్గేయకారులు ఉద్భవించకపోతే కర్ణాటక సంగీతానికి దశ, దిశ ఉండే అవకాశం ఉండేదికాదు.
ఎందుకంటే సంగీతానికి రాగమే జీవం. సర్వగమకాది భూషణాలతో సాహిత్యాన్ని అలంకరించి మనోహరంగా చిత్రించడమే వాగ్గేయకారుల లక్ష్యం-అందుకే మూర్తిత్రయంవారి రచనలు నిత్యనూతనంగా ఉంటూ విద్వాంసులగళాలలో ప్రతిధ్వనిస్తూ, సంగీతహృదయాలను పరవశంపజేస్తూనే ఉన్నాయి.
రసవంతంగా రచింపబడిన కృతిని అనుష్టానం చేస్తే, మంచి రాగజ్ఞానం కలుగుతుంది. కృతిసంపద విశేషంగా ఉన్నచోట, రాగజ్ఞానం వృద్ధి అవుతుంది. కృతినిబట్టి రాగం, రాగాన్నిబట్టి కృతి రెండూ పరస్పరాభివృద్ధి చెందుతూ సంగీతజ్ఞానం విస్తరిల్లుతుంది.
సంగీతలోకానికి వెలుగుదివ్వెలు, సంగీతమూర్తిత్రయంవారి దివ్యమైన రచనలు. ముగ్గురి లక్ష్యం మోక్ష సాధనమే. అయితే సంగీతాన్ని భక్తిమార్గంలో 'త్యాగరాజు' పయనిస్తే, దీక్షితులవారిది. ఉపాసనామార్గంలో వెళ్ళింది. శ్యామశాస్త్రులవారిది అనితరసాధ్యమైన శరణాగతభక్తి. మూర్తిత్రయంలో చిన్నవాడు ముత్తుస్వామి దీక్షితులు అఖండ విద్యాసంపన్నుడు. వేద, వేదాంత, యోగమంత్ర శాస్త్ర, జ్యోతిష, ఆగమశాస్త్రపండితుడై వెలువరించిన ఆయన రచనలన్నీ రాగభావ సమ్మిళితమైన, ఉపాసనామార్గంలో మననం చేసుకుంటూ గానం చేయదగ్గ మంత్రసమన్వితమైన దివ్యమైనకృతులు.
సంగీత కుటుంబంలో జన్మించిన దీక్షితులుతాతగారు శ్రీ వేంకటేశ్వర దీక్షితులు. తండ్రి రామస్వామిదీక్షితులు. తంజావూరులో స్థిరపడ్డారు. అక్కడ ఆస్థానవిద్వాంసుడైన వీరభద్రయ్య వద్ద సంగీతాభ్యాసం చేసి పండితుడయ్యాడు. ముత్తుస్వామి దీక్షితుల బాల్యంలో దక్షిణాదిలోని మణలిలో జమీందారీ ప్రభువైన ముత్తుకృష్ణమొదలియార్ యాత్రచేస్తూ తిరువారూరుకు వచ్చినప్పుడు రామస్వామి...............