శ్రీ సద్గురువుల దివ్య చరిత్రలు
శ్రీ దత్తచరిత్ర
అవధూత శిరోమణి
ఎనుబది నాలుగు లక్షల జీవరాసులు యందు సర్వోతృష్టమైనది మానవజన్మ. ఈ జన్మ యందే మోక్షమును సాధించుటకు సర్వవిధముల ప్రయత్నము సలుపుట మనకు విధాయకమై యున్నది. అట్లుగాక జగమేసత్యమని, శరీరమే నిత్యమని ఆహార నిద్రా భయ మైధునములకు లోనై వ్యర్థ జీవనమొనరించుట శుద్ధ అవివేకము.
మానవజన్మ లభించుట, ముముక్షువుగా పవిత్ర జీవన మొనరించుట, మహాపురుష సందర్శనము లభించుట యను మూడును కలిసివచ్చుట అత్యంత దుర్లభమని ఆదిశంకరుల వారు తెలిపియున్నారు. అరిషడ్వర్గములను జయించి, ఇంద్రియ వ్యాపారముల నణచి త్రిగుణాత్మకమగు మాయకు లోబడక ఆత్మ జ్ఞాన సంపన్నులై మెలగువారు జీవన్ముక్తులు.
అవధూత లక్షణములు : ఈ శరీరమే నేనని భ్రమించి శరీర పోషణకైపడరాని యిడుముల పాలగు బక్కమానవులు దైవోపహతులు. శరీరముపై ధ్యాసయనునది లేక సర్వకాల సర్వావస్థల యందు ఆత్మానంద రసానుభూతి యందు ఓలలాడుచూ; బాలుని వలె ఉన్మత్తుని వలె, పిశాచగ్రస్తుని వలె లోకము పోకడకు విరుద్ధముగా నుండువాడు అవధూత యని వ్యవహరింపబడును. విజన ప్రదేశముల యందున్నను, కమనీయ భూమి భాగములపై నున్నను; రమణీయరాజ మందిరముల యందున్నను వారు సమభావమున మెలగుదురు. జరిగినదానిని గూర్చి చింతించుట, జరుగనున్నదానిని గూర్చి ఆలోచించుట, జరుగుచున్న దానిని గూర్చి తలపోయుట యనునది లేక నిశ్చింతగా ఎల్లవేళల మౌనముద్రను దాల్చి ఇతరుల సంభాషణమును పెడచెవిని బెట్టి మెలగుట అవధూత లక్షణము. కారణమేమన ఆలోచనలే మనస్సు. మనస్సును జయించి లయ మొనరించుచూ నాశనమొనరించిన వానికి ఇక ఆలోచన లెట్లుండగలవు? కడుపు నింపుకొనుటకై ఆరాటము నొందుట, తలదాచుకొనుటకై పాటు పడుట యనునవి వారి స్వభావము కాదు. గడచిన రాత్రి యందలి స్వప్న శ్రీ సద్గురువుల దివ్య చరిత్రలు.................