మున్నుడి
'శివ' అంటే - అన్నిటిలోను 'నేను' తానై, అంతటినీ కొల్లగొట్టినవాడు. శ్రుతివాక్యమే దీనికి ప్రమాణం - కులుంచనాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః (శ్రీరుద్రం).
సోఒ కామయత. బహుస్యాం ప్రజాయేయేతి.
సతపో తప్యత సతపస్తష్ట్వా ఇదగ్ధం సర్వమసృజత.
తత్ సృష్ట్వా తదేవానుప్రవిశ్య (తైత్తిరీయం).
మొదట ఉన్నది తానే. 'ఒక్కడే' అని చెప్పుకోవచ్చేమో. ఊహకు అందని స్థితి ఆయె. "యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ... (ఏ స్థితిని చేరలేక వాక్కు మనసు వెనుకకు మరలుతున్నాయో? కదా! అటువంటి స్థితిలోని అతడు - ఏమీ తోచకనో, ఏదో తోచో "నేను చాలా అయితే ఎలా ఉంటుందో చూద్దాం" అనుకొని, తన తపస్సుచే ఈ కనిపించే, కనిపించని - వాటిని అన్నిటినీ సృష్టించాడు. ఆపై వాటిలో చొరవగా చొచ్చుకొని కూర్చున్నాడు. అలా హాయిగా కూర్చొని ఊరుకోక, ప్రతి వస్తువుకీ నామరూపాత్మకమైన వ్యక్తిత్వాన్ని "ఇదీ, అదీ" అని వర్ణించరానిదానిని కల్పించాడండి. దాంతో మొదలైంది. - ఆయనకు చక్కని కాలక్షేపం కోసం గావును, ఓ అద్భుతమైన లీల: "నువ్వు - నేనులు, నీది - వాదీలు, ప్రేమలు - పెళ్ళిళ్ళు, పుట్టుకలు - చావులు, సంతానాలు - సంబరాలు, కొట్టుకొని చంపుకోవడాలు, ఒట్టి అసూయలు, ఒట్టిపోని అసంతృప్తి, ఎంతటి కారాన్నీ చప్పగా అనిపించేటట్లు చేసే అహంకారం- ఇవన్నీ పుట్టుకొచ్చాయి. నీటి బుడగ వ్యక్తిత్వాలకే మురిసిపోయే జీవులను ఆడించి ఓడించసాగాయి. ఈ బాధలన్నీ సృష్టించబడినవాటివే. మరి వీటిని సృష్టించిన వాడు అదే, ఆ 'శివ' - హాయిగా ఉన్నాడు. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే - అంటే శాంతం, శుభం, రెండవది లేనిది; జాగ్రత్ స్వప్న సుషుప్తులకు, 'త్రిపుట్లకు భిన్నమైన స్థితియే బ్రహ్మం లేక 'శివం.'
-
ఇక ఎవరైతే ఈ సంసారం అనే అల్లరీ, రొచ్చూ తప్పించుకొని 'శివం'లా శాంతం అవ్వాలనుకొంటారో, ఆ దిశలో ప్రయత్నం సాగిస్తారో, వారే 'శివభక్తులు', ఆ యత్నం లేక సాధనలో నామరూపములకు అతీతమైన 'శివ'ని నామరూపాత్మకమైన 'శివు'నిగా భావించి, తమలోని గుణాలతోనే, భావాలతోనే, పరిమితులతోనే ఆయనను ఆరాధించి సాధించుటయే ఈ (పుస్తకం) కథలలోని విశేషమర్రా!
శివోహం అనే భావనాబలంతో దీనిని సాధించుట ఉంది. అయితే 'శివోహం' అంటే 'నేనే శివుడు' అనుకుంటే 'దొరికిపోయినట్లే. 'శివుడు'గా ఉండటం అంటే, ఎంతటి కత్తిమీద సామో, ఈ పుస్తకం చెపుతుంది. అందరినీ, అంతటినీ శివుడిగా చూస్తూ, తనను ఏ మాత్రం లెక్కచేయనివాడే "శివుడు." అందరినీ అన్ని విధాలా నింపుతూ (పూర్ణం), తనను ఏ మాత్రం లెక్కచేయనివాడే 'శివుడు.' అందరినీ అన్నివిధాలా నింపుతూ (పూర్ణం), తనను గుల్ల (శూన్యం) చేసుకొనేవాడు 'శివుడు' ఏం, శివుడివి అవుతావా?.........................