భారతావనిలో రచించిన ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథములలో ముఖ్యమైనది వరాహమిహిర విరచిత పంచ సిద్ధాంతిక. ఈ గ్రంథము కరణ గ్రంథము అయినప్పటికీ ఈ గ్రంథముయొక్క ప్రత్యేకత దీని రచనా కాలమునాటికి ఉపయోగములో ఉన్న 5 సిద్ధాంతములను భావి తరములకోసమై పొందు పరచడం. ఈ ఐదు సిద్ధాంతాములు పైతామహ, వాసిష్ఠ, రోమక, పౌలిశ మరియు సౌర సిద్ధాంతములు. ఇందు మొదటి రెండు సిద్ధాంతములు సూర్య చంద్రుల మధ్యమ గతులతో గణించబడి అతి ప్రాచీనమైన వేదాంగ జ్యోతిషము ఆధారితమైనవి. రోమక పౌలిష సిద్ధాంతములలో గణన స్పష్ట గ్రహములతో ఉన్నప్పటికీ దినారంభము యవనపురి సూర్యాస్తమముతో గణించినవి. వరాహ మిహిరాచార్యులు ఈ ఐదు సిద్ధాంతములను వివరిస్తూ అన్నిటిలోను సౌరసిద్దాంతములో తిథి గణన స్పష్టముగాను, నిర్దుష్టముగాను ఉన్నదని వ్యాఖ్యానించారు. |
అంతకు కొన్ని సంవత్సరాలకి ముందే ప్రచురించ బడిన ఆర్యభటుని ఆర్యభటీయములో గ్రహములన్నీ సుమారు యుతి అయ్యే స్థానమును విలోమముగా గణించి కలి యుగారంభముగా ప్రతిపాదించారు. ఆ సమయము నుండి 3600 సంవత్సరముల తదుపరి తన 23 వర్షముల వయస్సులో ఆర్యభటీయమును ప్రచురించినట్లుగా గ్రంథములో వివరించారు.