శ్రీవిద్యా ప్రస్థానత్రయము
ప్రస్థానము అంటే దారి, మార్గము, ప్రయాణము, మరణము అని అర్థం. భారతీయ తత్త్వశాస్త్రంలో మానవ జీవితాన్ని గమ్యానికి చేర్చేది. మానవుడి లక్ష్యము చతుర్విధ పురుషార్ధ సాధన. చతుర్విధ పురుషార్ధాలు అంటే ధర్మార్థ కామమోక్షాలు. వీటిలో నాల్గవదైన మోక్షమే నిజమైన పురుషార్ధము. అది సాధించటానికి మిగిలిన మూడు - ధర్మార్థ కామాలు సోపానాలుగా ఉపయోగిస్తాయి. పరమేశ్వరుడు ఈ సృష్టి ఎందుకు చేస్తున్నాడు? అంటే - ప్రళయం సంభవించినప్పుడు కర్మక్షయం అయిన జీవరాసి మోక్షం పొందింది. కర్మక్షయం కాని జీవరాసి తమకర్మను తమతోపాటు మూట కట్టుకున్నవై, పరమేశ్వరుడిలో లీనమయింది. ఇప్పుడు ఆ జీవరాసి యొక్క కర్మను క్షయంచేసి, వాటికి మోక్షం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే పరమేశ్వరుడు సృష్టి చేస్తున్నాడు. కాబట్టి సృష్టి చెయ్యటంలో పరమార్ధం జీవరాసికి మోక్షం అందించటము. కాబట్టి మానవుడి జీవిత లక్ష్యం ఏమంటే మోక్షసాధన. మోక్షాన్ని సాధించాలంటే మార్గము ఏమిటి? ఈ అర్థంలోనే ఇక్కడ ప్రస్థానము అనే పదం వాడబడింది. ప్రస్థానము అంటే-దారి, మార్గము, అని గతంలో చెప్పుకున్నాము. మానవుడు ఏ మార్గం గుండా ప్రయాణం చేస్తే మోక్షం పొందుతాడు? మరణానంతరము మానవుడు చేరటానికి రెండు ప్రదేశాలున్నాయి. 1. స్వర్గము 2. అపవర్గము. వీటిని చేరటానికి దారులు కుడా విడివిడిగా ఉంటాయి. 1. దక్షిణాయనము 2. ఉత్తరాయణము.
దక్షిణాయన మార్గానే పిత్రుయానము అంటారు. కర్మలు చేసినవారు ఈ మార్గం గుండా ప్రయాణం చేసి స్వర్గసుఖాలు అనుభవించి, కర్మశేషం అనుభవించటానికి భూమిమీద మళ్ళీ జన్మిస్తారు. వీరిలో ఉత్తమ కర్మలు చేసినవారు ఉత్తమయోనులయందు, నీచకర్మలు చేసినవారు నీచయోనులయందు జన్మిస్తారు. ఇలా భూమిమీద పుడుతూ, కర్మలు చేస్తూ, స్వర్గసుఖాలు, అనుభవించి మళ్ళీ జన్మిస్తుంటారు. గానుగకు కట్టిన ఎద్దులాగా సంసారమనే చక్రంలో పడి గిరగిరా తిరుగుతుంటారు.
రెండవది ఉత్తరాయణ మార్గము. దీన్నే దేవయానము అంటారు. పరమభక్తులు మాత్రమే ఈ మార్గము గుండా ప్రయాణించి పరమపదము చేరతారు................