శ్రీ కైవల్యసారథి
"నమస్కారం గురువుగారు !”
ప్రస్థావన
రెండు గొంతులు ఒక్కసారిగా పలికేటప్పటికి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు రత్నాకరుడు. ఎదురుగా చేతులు జోడించి వినమ్రులై నుంచుని ఉన్నారు అతని శిష్యులు కృష్ణశర్మ, నారాయణభట్టు.
చాలాకాలానికి వచ్చిన శిష్యులను చూసి ఆనందభరితుడైనాడు రత్నాకరుడు. కుశల ప్రశ్నల అనంతరం అడిగాడు 'వచ్చిన పని ఏమిటి ?' అని.
"గురుదేవా ! ఇప్పటి దాకా మీ వద్ద ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, కామకళా విలాసము, సుభగోదయస్తుతి, యోగినీ హృదయము, త్రిపురారహస్యము, దేవీభాగవతము, లలితా రహస్యనామాలకు భాష్యము వంటి శ్రీవిద్యా గ్రంథాలను అనేకం చెప్పుకున్నాము. పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు ఒక్కడే. ఆద్యంతములు లేనివాడు. సృష్టి స్థితి లయ కారకుడు. జగత్తంతా ఆవరించినవాడు. పిపీలికాది బ్రహ్మపర్యంతము తానే అయినవాడు అతడే. అతడికి అనేక నామాలు, అనేక రూపాలు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. ఏ రూపంతో కొలిచినా కరుణిస్తాడు. అటువంటి పరాత్పరుణ్ణి శివుడని, కేశవుడని, హరిహరుడని, శక్తిస్వరూపమని భక్తులు సేవిస్తూ ఉంటారు. మీ దయవల్ల శ్రీవిద్యా ప్రతిపాదితమైన గ్రంథాలను ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు విష్ణుసహస్ర నామాలకు భాష్యం చెప్పుకుందామని వచ్చాం. కాబట్టి కాదనక మమ్ములను కృతార్థులను చెయ్యండి" అన్నారు శిష్యులు.
ఆ మాటలు విన్న రత్నాకరుడు పరమానందభరితుడై “నాయనలారా ! మీ కోరిక తప్పక తీరుస్తాను. ఇవాల్టికి శెలవు తీసుకుని రేపు రండి.” అన్నాడు. అనుకున్న ప్రకారం ఆ మర్నాటి సాయంత్రం వచ్చిన శిష్యులు గురువుగారికి సాష్టాంగ ప్రణామాలర్పించి, ఆయన అనుమతితో సుఖాసీనులైనారు. రత్నాకరుడు అమితానందంతో శిష్యులను ఆశీర్వదించి విష్ణుసహస్రనామ భాష్యం చెప్పటం ప్రారంభించాడు..............