విష్ణుసహస్రనామము - శంకర భాష్యార్థదీపిక
8. ప్రేమ - 4 విధాలు
కుర్వన్త్య హైతుకీం భక్తిం (ఋషయస్సంశిత వ్రతాః) ఇతం భూతగుణో హరిః. నిజమైన ఋషులు నిర్హేతుకమైన - ఏ కారణం లేకుండాచేసెడి భక్తియే మోక్షప్రదము అందురు.
ప్రేమ నాల్గు విధాలు. 1. సాధువులు. 2. పీఠాధిపతులు. 3. స్వామీజీలు ఏవో మహిమలు చూపించెదరు. మన గ్రామానికి వచ్చినవారిపై మనకు ప్రేమకలగటం కద్దు. ఇట్టి ప్రేమ సాత్వికం అనవచ్చును - కేవలం వీరిపై ప్రేమ మహిమల కారణంగా కల్గింది. 2. భార్యాభర్తలకు, తల్లిబిడ్డలకు పరస్పరం కలిగెడి ప్రేమ రెండవది. ఇది రాజసప్రేమ అనవచ్చును. ఈ ప్రేమ వారి వియోగాదులలో వయసు దాటిన తరువాత పూర్వపు ప్రేమ కానరాదు. ఇది కేవలం రాజసప్రేమ. 3వదగు ప్రేమ, ఉద్యోగులకు అధికారులపైగల ప్రేమ. ఈ ప్రేమ ఉద్యోగము ఉన్నంతకాలమే, తరువాత ఇది కానరాదు. ఇది తామసిక ప్రేమ అనవచ్చును. 4వది - నిర్నిమిత్తమైన ప్రేమ - ఏ కారణాలు లేకుండా భగవంతుడగు విష్ణువును ప్రేమించుట, దీనివలన మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది, దీనికి అవ్యాజమైన ప్రేమ అనివ్యవహారము ప్రీజ్ - ప్రీణనే అనెడి ధాతువు నుండి ప్రేమ శబ్దము కల్గినది. ఇది భగవంతుని వైపు మళ్ళించినపుడు మాత్రమే భక్తి అను పేరుతో ఉండును. ఇతరమగు ప్రేమ లౌకికమైనది. సాత్విక, రాజస, తామస, గుణాలతో కూడినది అగును. నైమిత్తికమైన ప్రేమకు భగవంతుడు వానికి తగినఫలాలను మాత్రమే కలగజేయును.
వాక్కు సర్వము ఓంకారరూపము. ఆకుకు అడుగుభాగాన గల ఈనె ఆకు నంతటిని వ్యాపించి ఉన్నటులు సర్వవాక్కులలోను ఓంకారము వ్యాపించి ఉ న్నది అని ఉపనిషత్తునందలి యథాశంకునా వాక్ సర్వా సంతృణ్ణా అను మంత్రములో కలదు. ఈ సహస్రనామములు అన్నియూ ఏకవస్తుప్రతిపాదకములు..........