వేదములకు భాష్యము వ్రాసిన వారెవ్వరును వేద సమకాలికులు కాదు. వేదవ్యాఖ్యానములు వేదములకు సంపూర్ణ వ్యాఖ్యలు కావు, కానేరవు. వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్యన్యత్ వలె వైదిక దేవతలకు కొత్త రూపమును సంతరించినారు. వైదిక దేవతలను తూలనాడుట భ్రష్టు పట్టించుట పురాణాది వాఙ్మయమందే మొదలయినది. దేవతలరాజు యింద్రుడే అత్యంత నీచస్థితినొందినాడు. ఈ నాడు అత్యంతాధిక్యతనొంది పూజలందుకొనుచున్న దేవతలు వైదిక దేవతలు కారు. ఈ దేవతలకు స్థలపురాణాలు వెలిశాయి. కొత్త కొత్త కథలెన్నో అల్లబడ్డాయి. దీనికర్ధం దేవుడిని కూడా మనిషి తన వ్యాపారంలో ఒక భాగంగా చేసుకున్నాడు. అందుకనే కోటివిద్యలూ కూటి కొఱకేనన్న నానుడి. దేవుడన్న వాడినే ఈ స్థితికి తెచ్చిన అత్యన్తమేధా సంపత్తి కల మానవుడు సాటి మానవుణ్ణి వదిలి వేస్తాడనుకుంటే అది పొరబాటే. ఎవ్వరెన్ని పరిశోధనలు చేసినా సృష్టిస్థితిలయములే మూలాధారములు సృష్టి రెండు తెఱగులు.
దేవతలు సృష్ఠి
దేవతలెందరు అను మీమాంస బృహదారణ్య ఉపనిషత్ నందు మొదలైనది. యిక విషయములోనికి ప్రవేశించెదము. ఇక ప్రథమంగా యీ విషయం బృహదారణ్యకోపనిషత్తు నందు నవమ బ్రాహ్మణములో శాకల్య యాజ్ఞవల్య సంవాదరూప చర్చ జరిగినది. దేవతలెందరని శాకల్యుడడుగగా యాజ్ఞ వల్యుడు 303+3003 = 3306 అని నుడివినాడు. ఆ తరువాత ఈ సంఖ్యను కుంచించి 33 అని చెప్పి యున్నాడు. ఆ ముప్పది మువ్వురు ఎవరని యడుగ అష్ట వసువులు + ఏకాదశ రుద్రులు + ద్వాదశ ఆదిత్యులు + యింద్రుడు + ప్రజాపతి యని నుడివినాడు. పృథివి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము, కాలము, దిక్కులు, ఆత్మ అన్నవి అష్ట వసువులు...................