మృచ్ఛకటికమ్ కర్త, కాలము, ప్రాకృతాలు
- శ్రీ ఇప్పగుంట సాయిబాబా
నిర్మర్యాదమైన, సంస్కృత సాహిత్య ప్రపంచంలో మహాకవి శూద్రకుని కాలము ఒక ఉత్థాపిత సమస్య. ఇసక పాతర. అసలు పేరే చిత్రము.
ప్రాచీన మధ్యకాలీన సంస్కృత రచనల్లో శూద్రకుని గూర్చిన ప్రస్తావనలు పెక్కులున్నవి. తళుకు బెళుకులు కలిగిన వ్యక్తిగా శూద్రక రాజకవి విషయాలు జిగిబిగిగా అనలు కొనలు సాగినవి. దంతకథలు పొదలుపొదలుగా శూద్రకుని చుట్టూ అల్లుకొన్నవి.
భట్టబాణుని కాదమ్బరిలో శూద్రకుడు విదిశ రాజు. హర్షచరిత్రలో చకోరరాజు చంద్రకేతుని శత్రువుగా శూద్రకుడు కనబడతాడు. దండి దశకుమారచరిత్రలో శూద్రకుని పెక్కుజన్మల సాహసాలు వివరించబడినవి. కల్హణుని రాజతరంగిణి ప్రకారం మేటి విక్రమాదిత్యునితో పోల్చతగిన వ్యక్తిగా శూద్రకుడు గుర్తింపబడినాడు. క్షేమేంద్రుని బృహత్కథా మంజరిలో ఒక బ్రాహ్మణుని వలన శూద్రక రాజకవి వందేండ్లు బ్రతికినట్లు చెప్పబడింది. రాజశేఖరుని కావ్యమీమాంసలో శూద్రకుడు విద్యావ్యాప్తికి విశేషంగా కృషిచేసిన వ్యక్తిగా పేర్కొనబడినాడు. శూద్రకుని గొప్పతనం గాంగ పల్లవరాజుల చివరి నామంగా శూద్రక శబ్దం నిలిచింది.
రామిల సోమిల కవులు (క్రీ. 398-437 సం॥ మధ్య కాంచి కామకోటి పీఠాన్ని అధిష్ఠించిన మూక శంకరాచార్యుల శిష్యులు) 'శూద్రక కథా' కావ్యనిర్మాతలు. ఇది నేడు నామమాత్రావశిష్టము. చిత్తప-భోజదేవ నిర్మిత, శృంగారప్రకాశంలో దీపక కవికృత 'వినయవతీ శూద్రకమ్' అనే రూపకం ఉటంకింపబడినది. అంతేగాక పంచశిఖ నిర్మిత ప్రాకృత రచన 'సుద్దగ కహో' (శూద్రక కథా) కూడ ఉదాహరించబడింది. 'విక్రాన్త శూద్రకమ్' అనే అలబ్ధకృతి ఒకటి కలదు. భాగవతపురాణం అనుసరించి తొలి ఆంధ్రరాజు శూద్ర లేక శూద్ర అనే పేరుకల వ్యక్తి. స్కాందపురాణం శూద్రకుని ఆంధ్ర శాతవాహన వంశ తొలిరాజు శిముకునిగా భావించింది. డాక్టర్ శ్రీధరసోహాని (1914-2002) గారి పరిశోధనల ప్రకారం ప్రాచీన గాంగరాజవంశపు తొలిరాజు మొదటి శివకుమారుడే శూద్రకుడు. ఇతని కాలము క్రీ. 675-725. కాని మృచ్ఛకటికలోని ప్రాకృతాలు ఇతర అంతర్గత సాక్ష్యాలు ఈ కాలాన్ని నిర్ద్వంద్వంగా నిరాకరిస్తున్నవి.
పై విషయాల వల్ల శూద్రకుని కాలం గందరగోళంగా మారింది. చివరకు శూద్రకుడు. కల్పితవ్యక్తిగా భావించడం జరిగింది. నిజానికి మృచ్ఛకటిక నిర్మాత ప్రాచీనుడే. మహాకవే. ప్రాచీనతకు నిదర్శనాలు-...............