“రాముణ్ణి చేసుకొంటావా? కృష్ణుణ్ణి చేసుకొంటావా?” అని ఎవరైనా నన్నడిగితే ఠకీమని "కృష్ణుణ్ణి ” అని చెబుతాను. రాముణ్ణి భరించటం చాలా కష్టం. ఆయన దగ్గర ఒదిగి ఒదిగి ఉండాలి. మర్యాదగా, గౌరవంగా మెలగాలి. రెండడుగులు దూరంగా నిలబడి, నోటికి చేతిని అడ్డుగా పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడిన తరువాత ఒక్కసారిగా వెనక్కి తిరగకూడదు. రెండు మూడడుగులు నెమ్మదిగా వెనక్కి వేసి, అప్పుడు తిరగాలి. 'రామా', 'నువ్వు' అనకూడదు. అంటే ఆయనేమీ అనుకోకపోవచ్చు కానీ, లక్ష్మణుడో, భరతుడో కన్నెఱ్ఱ చేసి, నొసలు చిట్లించి చూస్తారు. సదా 'ప్రభూ', 'తమరు' అనాలి. పైపెచ్చు మాట్లాడినంత సేపూ చేతులు జోడించుకొని ఉండాలి. ఒళ్లు చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. పొరపాటున 'ఏదో మన దేవుడేలే' అని ఒకమాట ఎచ్చూతక్కువగా అందంటే, భార్యనో రాజ్యాన్నో ఉన్న పళాన ఒదిలేయగలడు.