సుప్రసిద్ధ శివాలయాలు
ఓం విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ
శరణం భవ భూతేశ కరుణాకర శంకర
హర శంభో మహాదేవ విశ్వేశ్వర వల్లభ
శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమృతేశాయ శర్వాయ శ్రీ మహాదేవ నమః
శ్రీ పరమేశ్వరునికి శివుడు, శంభుడు, శంకరుడు అని మూడు ముఖ్య నామములున్నాయి. శివ అంటే మంగళకరం. మంగళకర తత్త్వాల స్వరూపమే పరమేశ్వరుడు. శివ పదమునకు కళ్యాణదాతయని, కళ్యాణ స్వరూపుడని అర్థం. శివుడే సంసార భయాన్ని పోగొట్టేవాడు. కలియుగంలో శివుడే దైవమని కూర్మ పురాణం చెబుతోంది. కోటిజన్మల పుణ్యం వలనే శంకరుడి పైన భక్తి కుదురుతుందని స్కాందపురాణం వర్ణిస్తోంది. సర్వేశ్వరుడైన శంకరుని నివాసం కైలాసం. కైలాసనాధుని జటాజూటము నందు చల్లని గంగాదేవి విలసిల్లుచుండును. విశాలమైన ఫాలభాగము నందు నెలవంక నిలువగా, గళము నందు గరళము, మెడలో నాగరాజు, చెవులకు నాగ కుండలములు, ఫాలభాగంన త్రినేత్రం, నుదుటిపైన విభూతి రేఖలతో నిత్యం శివుడు ప్రకాశించుతుంటాడు. పులిచర్మ వస్త్రధారుడైన లయకర్త (రుద్రుడు) త్రిశూలం, ఢమరుకం ధరించి సర్వకాలము నందు సకల పుణ్య జీవులను రక్షించుకుంటాడు. లోక కళ్యాణ విఘ్నాలు కలిగించే భూతాలను (పాపులు) నాశనం చెయ్యటం కోసమే రేయింబవళ్ళు చితాభస్మాన్ని పూసుకుని, సర్పాలను ఆభరణాలుగా ధరించి, కపాలం చేబూని శ్మశానంలో తిరుగుతుంటాడు. భస్మ విభూషణుడైన బోళా శంకరుడు తన అర్ధాంగి అయిన పార్వతీదేవికి తన శరీరంలో అర్థభాగమిచ్చి, అర్థనారీశ్వరుడుగా లోక విఖ్యాతి పొందినాడు. భక్తుల భయం, బాధలు తొలగించి, అఖండమగు ఐశ్వర్యములు ప్రసాదించుటకు పార్వతీ సమేతంగా శంకరుడు భూమిమీద వెలసిల్లినాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు గల పుణ్యభూమిపైన పలు శివాలయాలు వెలిసినాయి. ఆలయాల నందలి శివలింగమును భక్తులు పలునామాలతో సేవించుకుంటారు.............