నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స!
సంయుక్తనికాయ
సగాథ' వర్గం
1 దేవతా సంయుక్తం
1. రెల్లు వర్గం
1. వరదను దాటటం
1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో అనాథపిండికుని జేతవన ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు రాత్రి చాలా గడిచాక, ఒకానొక దేవత సుందరమైన తన దేహకాంతితో జేతవనాన్నంతా ప్రకాశింపజేస్తూ, భగవానుని సమీపించాడు. సమీపించి భగవానునకు నమస్కరించి ఒక ప్రక్కగా నిలబడ్డాడు. ఒకప్రక్కగా నిలబడిన ఆ దేవత భగవానునితో - "మారిస (= అయ్యా), మీరు వరదను ఎలా దాటారు?” అన్నాడు - "ఆయుష్మాన్! ఎక్కడా ఆగకుండ, పరిశ్రమించకుండా నేను వరదను దాటాను." "మారిస! మీరు ఆగకుండ, పరిశ్రమించకుండా వరదను ఎలా దాటారు?" "ఆయుష్మాన్! నేను ఆగినప్పుడు మునిగిపోయాను. ప్రయత్నించినప్పుడు కొట్టుకు పోయాను. ఈ విధంగా నేను ఆగకుండా, ప్రయత్నించకుండా (= అంటే మధ్యమమార్గం ద్వారా) ప్రవాహాన్ని దాటాను. "
(దేవత)
“ఆగకుండా, ప్రయత్నించకుండా లౌకిక ఆసక్తిని తరించి,
పరినివృతుడైన బ్రాహ్మణు (అర్హతు) ని ఎట్టకేలకు చూస్తున్నాను. " |
దేవత ఇలా చెప్పగా శాస్త్ర దానిని ఆమోదించాడు. అంతట దేవత, శాస్త్ర నన్ను ఆమోదించాడు' అనుకొంటూ, భగవానునకు నమస్కరించి, ప్రదక్షిణం చేసి, అక్కడే, అప్పుడే అంతర్ధానమయ్యాడు. ...........