స్వర్ణమయూరం
హేమంతం!
ఉదయం ఆరు గంటలైనా ఇంకా వెలుగు రేఖలు విచ్చుకోలేదు. తూరుపు సిందూరం బొట్టు పెట్టుకొని ప్రపంచాన్ని మేల్కొలపడానికి ఆయత్తమవుతున్న వేళ...
ఆ సమయంలో సమతా ఎక్స్ప్రెస్ బొబ్బిలి స్టేషన్లో ఆగింది. ఏసీ బోగీలోంచి వంశీధర్ తన లగేజీతో ప్లాట్ఫారం మీదకు దిగాడు. అక్కడ ఆ ట్రైన్ రెండు నిముషాలే ఆగుతుంది. అందుకనీ త్వరత్వరగా లగేజీని దింపాడు.
ఇంతలో "వంశీ" అంటూ వెనక నుంచి పిలుపు వినబడటంతో అటువైపు తిరిగాడు.
దూరంగా అతని చిన్నాన్న 'శంకరం' పరుగు పరుగున జనాన్ని తప్పించుకుంటూ వస్తున్నాడు. ఏసీ బోగీ బాగా వెనక నుండటంతో అతను గాబరా పడుతూ వచ్చాడు. "గాబరా వద్దు చిన్నాన్నా... సామానంతా దింపేసాను. అయినా ఈ వయసులో నువ్వెందుకు చెప్పు రావటం. నేనేం చిన్నవాడినా?" అన్నాడు సామాను వీల్ ఛైర్ బేగుమీద పెడుతూ.
"నిన్న మీ నాన్న మందుల కోసం వచ్చాను. రాత్రి తొమ్మిదైంది. ఇంక ఆవేళప్పుడు ఊరేం వెళతాం అనీ స్టేషన్లోని వెయిటింగ్ హాల్లో ఉండి పోయాను" అనీ చెబుతుంటే బయట ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చారు.
"మన ఊరి వెంకన్న ఆటోకి చెప్పాను” అనీ చెబుతుండగానే వాళ్ళ ముందర ఓ ఆటో వచ్చి ఆగింది.
ఆ తరువాత ఆటో బయలుదేరింది.
ఇంకా వెలుగురేఖలు విచ్చుకోలేదు.
కొద్ది నిముషాలకే ఆటో రోడ్డు బాట పట్టింది. అక్కడికి సుమిత్రాపురం 20 కిలోమీటర్లు.................