తెలుగు నవలా కాసారంలో సరికొత్త కెరటం
శ్రీ కాశీభట్ల వేణుగోపాల్ వ్రాసిన 'తపన', ఈ సంవత్సరం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తాన్యా స్వాతి పత్రికతో సంయుక్తంగా నిర్వహించిన రెండవ నవలల పోటీలో లక్ష రూపాయల ఏకైక బహుమతి పొందింది. తెలుగు నవలకి కొత్త చైతన్యం కల్పించడం తానా నవలల పోటీ లక్ష్యమైతే, ఈ రచన ఆ ఆశయానికి దీటైనదే.
ముందుమాటలోనే ఈ రచయిత తన అభీష్టాన్ని, ఆశయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశాడు. పాఠకుడిలో సోమరితనాన్ని అసరా చేసుకొని బ్రతకడం మంచి రచయిత లక్షణం కాదనీ, సోమరి పాఠకుణ్ని నిద్రలేపి వాడి మెదడుకు వ్యాయామం కల్గించాల్సిన అవసరమూ, బాధ్యతా సీరియస్గా కలం పట్టిన ప్రతి రచయితకూ ఉందని స్పష్టంగా, నిర్ద్వంద్వంగా తన ఉద్దేశాన్ని చెప్పి మొదలు పెట్టిన ఈ రచన, మిగతా రచయితలకే కాదు, ఈ రచయితకూ ఈ నవలా పాఠకులకు కూడా డైరెక్ట్ ఛాలెంజ్!
తనకు తానుగా పెట్టుకొన్న ఈ పరీక్షలో రచయిత నెగ్గాడనే నా ఉద్దేశం. ఈ నవల పూర్తిగా చదివితే మీకు నచ్చొచ్చు. నచ్చకపోవచ్చు. ఈ నవలకు సామాజిక ప్రయోజనం ఉందనో, లేదనో మీరు అనుకోవచ్చు. రచయిత చెప్పదలచుకుందేమిటి, చెప్పిందేమిటి అని చాలాసేపు వాదించుకోవచ్చు. మధనపడవచ్చు. ఇది గొప్ప కథా వస్తువేనా అని కోప్పడవచ్చు. అయితే ఈ నవల గురించి ఆలోచించకుండా ఉండడం మాత్రం అసాధ్యమే.
ఈ నవలలో కథావస్తువు, పాత్ర చిత్రణ, కథనశైలి, భాషా ప్రయోగం చాలా ప్రత్యేకమైనవి. మామూలు నవలలో కనిపించనివి. దాంపత్య సంబంధాలు కథావస్తువుగా...................