పరిచయం
విబుధవరులవలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపఱతు “
"ఏకః శబ్దః సమ్యగ్ జ్ఞాతః సుప్రయుక్తః స్వర్గే లోకే కామధుగ్ భవతి"
అంతర్జాలంలో ఏదో అన్వేషిస్తుంటే గురుప్రార్థనా శ్లోకం కనిపించింది. అందులో వర్ణక్రమ (spelling) దోషాలు కనిపించాయి. అందువల్ల తెలుగులోనే వేరే 'సైట్లు' కూడా వెదికాను. ఒక చోట “గురుబ్రహ్మ" అనీ,ఇంకొక చోట “గురు విష్ణుః” అనీ, మరొక చోట "గురువే నమః” అనీ, వేరొక చోట “గురువేన్నమః” అనీ, ఇంకా - "బ్రహ్మః”, “నమహ” ఇలా - ఎన్ని తెలుగు 'సైట్లు' చూచినా, అన్ని చోట్ల ఏదో ఒకటో, రెండో, వీలైతే ఇంకా ఎక్కువో తప్పు లున్నాయి. ఎవ రికి వారు యథాశక్తి తప్పులనే చొప్పించారు తప్ప, తప్పుల్ని దిద్దే ప్రయత్నం చేసి నట్లు లేదు. ఇక విసిగి, నాగలిపిలో ఉండే సంస్కృతం, హిందీ 'సైట్లు' వెదికితే అక్కడ మాత్రమే ససి అయిన పాఠం కనిపించింది. ఇంత సుప్రసిద్ధశ్లోకంలోనే ఇన్ని వర్ణక్రమదోషాలుంటే ఎలా? వ్యాసప్రోక్తస్కాందాంతర్గత 'గురుగీత' లోని ఈ శ్లోకానికి పాఠాంతరాలు కూడా కనిపిస్తాయి కాని, అవి వ్యాకరణసమ్మతాలు ; వర్ణక్రమదోషరహితాలు. కనుక పరిగ్రాహ్యాలు. కాని, తెలుగు 'సైట్ల'లో ఎక్కువగా కనిపించే వర్ణక్రమదోషాలు మాత్రం పరిహార్యాలు కదా!
మన వారికి ఉన్నది అజ్ఞానం అనే కంటే అలసత్వం అనడం సమంజ సం అనిపిస్తుంది. తప్పు తెలియక పోవడం తప్పు కాదు- కానీ తప్పు తెలుసుకోక పోవడం గొప్పతప్పు. ఇలా ఊరుకొంటే ఈ సోమరితనం మనదగ్గర మాత్రమే ఆగదు, మనం దాన్ని భావితరాలకు 'వారసత్వం'గా అందించినట్లే. మనకోసం కాకున్నా, వారికోస మైనా తప్పులు దిద్దడం మన విధి.
నేటి కాలంలో 'నెట్' మాత్రమే గురుకులం, అది నేర్చిన వాడే గురుకుల క్లిష్టుడు - అయినపుడు, ఆ పరిస్థితుల్లో దాన్ని చక్కదిద్దవద్దా? ఏ దేశం/ప్రాంతం కులం/మతం అయినా, ఏ వృత్తికి/విద్యకు అయినా ఒక గురువు ఉండకతప్పదు. ఏకలవ్యుడికి కూడా ఒక గురువు కావలసి వచ్చాడు. 'గురి' యే గురువు!..........