తరిగొండ వెంగమాంబ
తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ కవయిత్రి తరిగొండ వెంగమాంబ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో జీవిత ప్రస్థానాన్ని సాగించిన భక్త కవయిత్రి. యోగిని, విదుషీమణి వెంగమాంబ. ఆనాటి సమాజం నుంచి, బాలవితంతువుగా ఎన్నో అవయానాలు ఎదుర్కొన్నా, ఆత్మవిశ్వాసంతో జీవించి, వేంకటేశ్వరస్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలను పొంది తరించింది వెంగమాంబ. వెంగమాంబ స్వామివారికి సమర్పించిన ముత్యాల హారతి నేటికీ సంప్రదాయంగా కొనసాగటమే ఆమె భక్తి తత్పరతకి నిదర్శనం.
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిగాంచిన సాహిత్య ప్రక్రియలు- యక్ష గానాలు, ద్విపద రచనలు, శతకాలు, పద్యకావ్యాలు, కీర్తనలు మొదలైనవి వెంగమాంబ సాహిత్య వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన కీర్తి కిరీటాలు అనటం అక్షర సత్యం. వెంగమాంబ జీవిత విశేషాలతో చలన చిత్రం రావటంమనేది ఆమె భక్త కవయిత్రిగా పాఠకుల మనస్సులో చిరస్మరణీయురాలయిందనటం అతిశయోక్తికాదు. కేంద్ర సాహిత్య అకాదమివారు తరిగొండ వెంగమాంబ మోనోగ్రాఫ్ నాచే రాయించటం నా భాగ్యంగా భావిస్తూ, సాహిత్య అకాదమివారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తున్నాను.
***
ముక్తేవి భారతి ప్రముఖ రచయిత్రి. ఉత్తమ అధ్యాపకురాలు. కేసరి కుటీరం, మద్రాసువారి గృహలక్ష్మి స్వర్ణ కంకణం పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం, ఆమెరికాలోని హోస్టన్లో వంగూరి ఫౌండేషన్ నుంచి జీవన సాఫల్య పురస్కారం మొదలైనవి, ఐ.ఎ.ఎస్. స్టడీ సర్కిల్లో ఫాకల్టీ మెంబరుగా, 45 పైగా గ్రంథాలు రచించిన విశిష్ట రచయిత్రిగా, తెలుగు పాఠక లోకానికి సుపరిచితురాలు. షణ్ముఖశర్మగారి ఋషిపీఠం మాసపత్రికలో కోనేటి రాయుడు నవల పాఠకాదరణాన్ని పొందింది. ఇల్లందల సరస్వతీదేవి, దుర్గాబాయ్ దేశ్ ముఖ్, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మొదలైనవారి బయోగ్రఫీస్ ముక్తేవి భారతి రచనలలో కొన్ని. ప్రబంధాలను నవలలోగా రచించి పాఠక లోకానికందించిన ప్రత్యేకత ముక్తేవి భారతిగారి సాహిత్య జీవితంలో ఒక గొప్ప గుర్తింపుగా సాహితీవేత్తలు అభినందిస్తారు ఆమెను......................