చాలా కాలంనుండి వాయిదా వేస్తూ వస్తున్న పుస్తకం ఇది. ద్రావిడ విశ్వవిద్యాలయం నుండి ఉద్యోగవిరమణ చేసిన తర్వాత అప్పటిదాకా రాయకుండా మిగిలిపోయిన పరిశోధన గ్రంథాలు సృజనాత్మకరచనలు ఒక్కొక్కటిగా బయటికి తెస్తున్నాను. తెలుగులో ఉండిన కొనసాగివస్తున్న లేఖనసంప్రదాయం గురించి పదస్వరూపం గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. వ్యక్తులు, రచయితలు, పత్రికలు, పరిశోధకులు పదవిభజన విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్దతిని పాటిస్తున్నారు. అంటే ఒక అవ్యవస్థ నెలకొని ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలా అవ్యవస్థ ఉండడానికి చారిత్రక కారణాలున్నాయి. మాట్లాడడం వేరు. రాయడం వేరు. మాట్లాడినట్లు రాయవచ్చు నూటికి నూరుపాళ్ళు మాట్లాడినట్లు రాయవచ్చు అనే భావన సరైందికాదు. సృజనాత్మకరచనల్లో అంటే నవలలు కథలు రాసేటప్పుడు పాత్రోచితభాష భాష అవసరం అయిన చాలా సందర్భాలలో పూర్తిగా మాట్లాడిన భాషనే రాయవచ్చు అనేది కూడా నూటికి నూరుపాళ్ళు సాధ్యమయ్యే పని కాదు. మాట్లాడే భాషలో కాకువు ఉంటుంది. స్వరం ఉంటుంది దాని హెచ్చుతగ్గులు ఉంటాయి. మాటలతోపాటు ఈ కాకువు స్వరం శ్రోతకు మరికొన్ని అర్థాలను అందిస్తాయి. రాసిన భాషలో ఈ సమాచారం చదువరికి అందదు. "ఇలా వచ్చావు" ఈ ఒక్క వాక్యాన్ని తద్ధర్మార్థకంలో వాడవచ్చు. ప్రశ్నించడానికి వాడవచ్చు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడానికి వాడవచ్చు. కోపాన్ని వ్యక్తం చేయడానికి కూడా వాడవచ్చు. ఇన్ని సంగతులు పలికిన వాక్యంలో ఉంటాయి. కానీ రచయిత “ఇలావచ్చావు" అని రాసి ఊరుకుంటే కుదరదు “ఇలా వచ్చావు" (దానికింద) "అంటూ కోపంగా ప్రశ్నించాడు" (ఒక పాత్ర) అని రాస్తే తప్ప ఆ వాక్యం ఏమి అర్థాన్ని ఇచ్చిందో చదువరికి తెలియదు.కానీ మాట్లాడేటప్పుడు ఈ వివరణ అవసరం లేదు. కాబట్టి మాట్లాడే భాషని ఉన్నదున్నట్లు రాయడం కుదరదు.